తెలంగాణలో న్యాయవాద దంపతుల హత్య నేపథ్యంలో దేశ వ్యాప్తంగా న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం తెచ్చేలా ఆదేశాలివ్వాలని కోరుతూ న్యాయవాది కాసోజు మహేశ్ చారి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని జస్టిస్ బొపన్న, జస్టిస్ రామసుబ్రమణియన్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో న్యాయవాద వృత్తిలో ఉన్నవారికి సరైన భద్రతా లేదని న్యాయస్థానం దృష్టికి పిటిషనర్ తరఫు న్యాయవాది తీసుకెళ్లారు.
తెలంగాణలో జరిగిన అడ్వకేట్ దంపతుల హత్య ఉదంతమే ఉదాహరణ అని గుర్తు చేశారు. ఈ విషయంలో తామేమీ చేయలేమని.. చట్టం తీసుకొచ్చే అంశంపై న్యాయ శాఖను ఆశ్రయించాలని సీజేఐ ధర్మాసనం సూచించింది. సుప్రీంకోర్టు సూచనతో పిటిషనర్ మహేశ్ చారి తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.
ఇదీ చూడండి: క్యారీ ఓవర్పై ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం