ప్రస్తుతం అన్ని అత్యవసర సేవలకు నిమ్స్ లేదంటే గాంధీ, ఉస్మానియాపై ఆధారపడుతున్నారు. నిమ్స్‌లో సేవలు ఉచితం కాదు. సేవలకు ఛార్జీలు చెల్లించాలి. ఎక్కువ మంది పేద, మధ్య తరగతి ప్రజలు గాంధీ లేదంటే ఉస్మానియాకు వెళుతున్నారు. ప్రస్తుతం కరోనా రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో గాంధీ ఆసుపత్రిని కేవలం కొవిడ్ సేవల కోసం కేటాయించారు. ఇతర సేవల కోసం ఉస్మానియాకు వెళ్లాల్సిందే. గతేడాది మార్చి నుంచి 9 నెలల పాటు గాంధీని ఈ సేవలకే కేటాయించారు. తాజాగా అదే పరిస్థితి నెలకొంది.
జనాభాకు తగ్గట్లుగా...
రోజురోజుకు గ్రేటర్ హైదరాబాద్ విస్తరిస్తోంది. కోటి జనాభా దాటింది. ఔటర్ రింగ్‌రోడ్డు వరకు కొత్త కాలనీలు, వెంచర్లు పెరుగుతున్నాయి. రహదారులు విస్తరిస్తున్నారు. ఇప్పటికే గ్రేటర్ చుట్టూ 150 కిలోమీటర్ల పరిధిలో అవుటర్ రింగ్ రోడ్డు ఉంది. వీటి చుట్టూ సర్వీసు, అప్రోచ్, రేడియల్ రోడ్లు రానున్నాయి. వాహనాల రద్దీ పెరుగుతోంది. తరచూ ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతున్నాయి. శివార్లలో ఏటా వేయి పైనే ప్రమాదాలు జరుగుతున్నాయి. వందల మంది మృత్యువాత పడుతున్నారు. చాలామంది గాయాల బారిన పడుతున్నారు. ప్రస్తుతం కరోనా కాలంలో ఆదిలాబాద్, నిజామాబాద్ నుంచి రోగులు నగరానికి వస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి నగరానికి ప్రైవేటు లేదా ప్రభుత్వ ఆసుపత్రికి చేరే సమయానికి తీవ్ర జాప్యం అవుతోంది. ఆసుపత్రికి చేరేలోపు పుణ్యకాలం గడిచిపోతోంది. గతంలో నిమ్స్‌లో జరిగిన అధ్యయనం ప్రకారం ఒక ప్రమాదం జరిగిన తర్వాత అత్యవసర విభాగానికి క్షతగాత్రులు చేరుకునే సరికి 3-4 నాలుగు గంటలు పడుతోంది. కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ సమయం అవుతోంది. దీంతో గోల్డెన్ అవర్ గడిచిపోయి చాలామంది ప్రాణాలకే ముప్పు వాటిల్లుతోంది. ప్రమాదం జరిగిన గరిష్ఠంగా గంట నుంచి మూడు గంటలలోపు ఆసుపత్రికి తరలిస్తే ప్రాణాలు కాపాడే వీలు ఉంటుంది. ముఖ్యంగా తల, వెన్నుముకకు దెబ్బలు తగిలిన వారికి ఈ సమయం ఎంతో కీలకం. దీంతో ఉస్మానియా, గాంధీలకు చేరుకునే సరికి చాలామంది ప్రాణాలు విడుస్తున్నారు. ప్రస్తుతం గాంధీలో ఇతర సేవలు అందుబాటులో లేకపోవడంతో ఉస్మానియా ఒక్కటే ఆదుకుంటోంది. కొన్నిసార్లు వెంటిలేటర్ల కోసం నిరీక్షణ తప్పడం లేదు.
పట్టాలెక్కని ప్రణాళికలు..
* అత్యవసర సమయాలతోపాటు జిల్లాల నుంచి వచ్చే రోగులకు అందుబాటులో ఉండేలా నగరం చుట్టూ ఆసుపత్రుల నిర్మించాలని గతంలో ప్రణాళిక సిద్ధం చేసింది. కొవిడ్ సందర్భంగా గచ్చిబౌలిలోని క్రీడాగ్రామంలో ఉన్న భవంతిలో తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్) ఆసుపత్రికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఇక్కడ 1500 పడకలు అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం 1200 మంది రోగులు చికిత్స తీసుకుంటున్నారు. గాంధీలో మరో 1200 చికిత్స పొందుతున్నారు. ఒకవేళ టిమ్స్ లేకుంటే ఈ భారమంతా ఇతర ఆసుపత్రులపై పడేది. సేవల్లో లోపం వల్ల ఎంతోమంది ప్రాణాలకు ముప్పు వాటిల్లేది.
* టిమ్స్ మాత్రమే కాకుండా శామీర్‌పేట, మేడ్చల్, కొంగరకలాన్ ప్రాంతాల్లో మరో మూడు ఆసుపత్రులు ఏర్పాటుకు 6 నెలల క్రితం ప్రణాళిక సిద్ధం చేశారు. అప్పట్లో ఉన్నతాధికారులు కూడా ప్రకటించారు.
* నగరం చుట్టూ ఆసుపత్రుల వల్ల జిల్లాల నుంచి వచ్చే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. నగరం వరకు రావాల్సిన అవసరం ఉండదు. దీంతో నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్‌పై భారీగా ఒత్తిడి తగ్గుతుంది. ఇక అవుటర్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగినప్పుడు సుదూరంలోని ఉస్మానియా, నిమ్స్‌కు తరలించేబదులు.. శివార్లలోని ఆయా సూపర్ స్పెషాలటీ ఆసుపత్రుల్లో చేర్పించడానికి వీలు ఏర్పడుతుంది.
* గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన టిమ్స్ ఆసుపత్రిలో జిల్లాల నుంచి వచ్చే రోగులతోపాటు చుట్టు పక్కల ప్రజలు కరోనా చికిత్సలు తీసుకుంటున్నారు. కొవిడ్ అనంతరం ఇక్కడ సాధారణ సేవలు ప్రారంభించనున్నారు.
* కొత్తగా మూడు ఆసుపత్రుల నిర్మాణంతో గ్రేటర్ ప్రజలకే కాకుండా.. చుట్టు పక్కల జిల్లాల ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అంటున్నారు. వీలైనంత వేగంగా వీటి ఏర్పాటుకు అడుగులు పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చూడండి: 'రుణాలు ఎగవేసి స్టేలు అడగడం ఆనవాయితీ అయిపోయింది'