Uppudu biyyam: రాష్ట్రంలో ఉప్పుడు బియ్యం తయారీ తర్వాత మిగిలిన ధాన్యాన్ని ఏం చేయాలి? వేలం వేయాలా? నూకల నష్టాన్ని చెల్లించి సాధారణ బియ్యంగా మార్పించాలా? అన్న సందిగ్ధంలో ప్రభుత్వం ఉంది. ఉప్పుడు బియ్యం విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందించటం రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఉపశమనం కలిగించింది. 2021-22 యాసంగి సీజన్‌కు సంబంధించి మరో 8లక్షల మెట్రిక్ టన్నుల పోషకాలతో కూడిన ఉప్పుడు బియ్యం తీసుకునేందుకు కేంద్రం అంగీకరించింది.
గతంలో ఇచ్చిన 6.05 లక్షలు టన్నులు కలిపితే 14.05 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యం తీసుకున్నట్టవుతుంది. యాసంగిలో సుమారు 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. అందులో సుమారు 21 లక్షల మెట్రిక్ టన్నులు ఉప్పుడు బియ్యానికి సరిపోతాయి. మిగిలిన 30 లక్షల టన్నులను ఏం చేయాలో తేల్చుకోలేని పరిస్థితి. పశ్చిమ బెంగాల్‌కు 5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని విక్రయించాలన్న ఆలోచనతో ఇప్పటికే 7.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ చేసేందుకు పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
మరో 10 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం తీసుకోవాలని కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనగా ఉంది. కేంద్రం నుంచి సానుకూలత వస్తే సమస్య నుంచి గట్టెక్కడం పెద్ద కష్టం కాదని అధికారులు భావిస్తున్నారు. అయితే కేంద్రం ఎంత మేరకు సానుకూలంగా స్పందిస్తున్న అంశంపై వారిలో సైతం అనుమానాలు లేకపోలేదు.
ఉన్నతస్థాయి కమిటీ తర్జనభర్జనలు: యాసంగి ధాన్యాన్ని ఉప్పుడు బియ్యంగా కాకుండా సాధారణ బియ్యంగా మారిస్తే వచ్చే నూకల నష్టాన్ని నిర్ధారించే అంశంపై ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి కమిటీ కొన్ని నెలలుగా తర్జనభర్జనలు పడుతూనే ఉంది. ఎంతమేరకు నూకలు వస్తాయన్న అంశాన్ని తేల్చే బాధ్యతను సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(సీఎఫ్‌టీఆర్‌ఐ), మైసూర్‌కు అప్పగించింది.
క్వింటాకు 31 కిలోల వరకు నూకలొస్తాయని ఆ సంస్థ నివేదిక ఇచ్చింది. అదనంగా ఉప్పుడు బియ్యం తీసుకునేందుకు కేంద్రం అంగీకరించకపోతే ఆ ధాన్యాన్ని వేలం వేయాలా? లేక మిల్లర్లకు నూకల నష్టాన్ని చెల్లించి సాధారణ బియ్యంగా మార్చటమా? అన్నది రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించాలి. మంత్రుల స్థాయి కమిటీ 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వేలం వేయాలని నిర్ణయించింది. ఆ మేరకు ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు సైతం పంపారు. అయితే, ఏది తక్కువ నష్టమన్న అంశాన్ని నిర్ధారించటంలో జాప్యం జరుగుతున్నట్లు సమాచారం.
ఇవీ చదవండి: Eamcet Results: ఎంసెట్ ఫలితాలు విడుదల.. త్వరలోనే కౌన్సెలింగ్ ప్రారంభం