రాష్ట్రంలోని ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల కోతకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ పెన్షనర్ల జేఏసీ దాఖలు చేసిన సవరణ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఫించన్‌లో కోతపై దాఖలైన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ సేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధంగా ఉందని జేఏసీ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదించారు.
ఆర్డినెన్స్ కొట్టివేయాలని కోరుతూ తమ పిటిషన్‌ను సవరించాలని కోరారు. గవర్నర్, రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చాలని కోరారు. గవర్నర్‌ను ప్రతివాదిగా చేర్చేందుకు హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి.. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
ఇదీ చదవండి: 'వివాదాల పరిష్కారానికి సరైన మార్గాలు అన్వేషించాలి'