మంత్రి కేటీఆర్ (KTR) సూచనతో.. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని విరించి ఆస్పత్రిపై ఆరోగ్య శాఖ కొరడా ఝులిపించింది. కొవిడ్ చికిత్సల లైసెన్సును రద్దు చేస్తూ ఆదేశాలు జారీచేసింది. నల్గొండకు చెందిన వంశీకృష్ణ ఆస్పత్రి నిర్లక్ష్యం వల్లే మరణించారనే ఫిర్యాదుపై స్పందించిన ఆరోగ్య శాఖ 24 గంటల్లోనే చర్యలు చేపట్టింది. ఈ నెల 9న వంశీకృష్ణ అనే యువకుడిని బంధువులు విరించి ఆస్పత్రిలో చేర్పించారు. అతను నిన్న ప్రాణాలు కోల్పోయాడని బంధువులకు సమాచారం ఇచ్చారు.
దీనిపై ఆగ్రహించిన మృతుడి కుటుంబ సభ్యులు.. 20 లక్షలు వసూలు చేసి.. ప్రాణం తీశారని కన్నీళ్లు పెట్టుకున్నారు. తొలి రెండు రోజులు ఎలాంటి చికిత్స చేయకుండా నిర్లక్ష్యం వహించారని ఆగ్రహించారు. చికిత్స వివరాలు చెప్పాలని నిలదీశారు. చివరి దఫా బిల్లు చెల్లించకుండానే మృతదేహాన్ని తీసుకెళ్లమనడంపైనా అనుమానం వ్యక్తం చేశారు. కొంత డబ్బు తిరిగి ఎందుకు చెల్లిస్తామన్నారని ప్రశ్నించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ అంశాన్ని ముబషిర్ అనే వ్యక్తి మంత్రి కేటీఆర్(KTR)కు ట్వీట్ చేశారు. విరించి ఆస్పత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. గతేడాది వైద్యుల నిర్లక్ష్యం, అధిక ఫీజుల వసూలు వంటి కారణాలతో విరించి ఆస్పత్రి లైసెన్స్ రద్దయిన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. విచారణ ముగిసే వరకు సంబంధిత ఆస్పత్రిని మూసేయాలని నెటిజన్ విజ్ఞప్తి చేయగా.. స్పందించిన మంత్రి.. విషయాన్ని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లారు. విచారణ వేగవంతం చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించగా.. విరించి ఆస్పత్రికి కొవిడ్ చికిత్సల లైసెన్సు రద్దు చేస్తూ ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
మరో ఐదు ఆస్పత్రులపై చర్యలు
పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్స కోసం అధిక బిల్లులు వసూలు చేస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదులపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. అధిక బిల్లులు వసూలు చేస్తున్న 5 ఆస్పత్రుల కొవిడ్ సేవల లైసెన్సు రద్దు చేసింది. కేపీహెచ్‌బీలోని మ్యాక్స్ హెల్త్ ఆస్పత్రి, సనత్‌నగర్‌లోని నీలిమ, కాచిగుడాలోని టీఎక్స్ ఆస్పత్రి, బేగంపేట విన్ ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్సల లైసెన్సును రద్దు చేసింది. ఆయా ఆస్పత్రులపై ఫిర్యాదుల నేపథ్యంలో కొవిడ్ సర్వీస్‌ల లైసెన్సు రద్దు చేస్తునట్టు ఆరోగ్య శాఖ ప్రకటించింది.
ఇదీ చూడండి: ktr: రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గుతోంది: కేటీఆర్