Industrial parks: రాష్ట్రంలోని కొత్త పారిశ్రామిక పార్కుల్లో టౌన్‌షిప్‌ల నిర్మాణ పనులు ముందుకు సాగక కార్మికులు అగచాట్లు పడుతున్నారు. పారిశ్రామిక వాడల్లోగానీ, వాటికి సమీపాల్లో గానీ నివాస వసతి లేక దూరప్రాంతాల్లో ఉంటూ వ్యయప్రయాసలకోర్చి పనులకు రావాల్సి వస్తోంది. రాష్ట్రంలో 156 పారిశ్రామిక పార్కులున్నాయి. ఇందులో 16 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. త్వరలో మరో 12 ప్రారంభం కానున్నాయి. నైపుణ్యం ఉన్నవారితో పాటు లేని వారికి సైతం పనులు దొరుకుతున్నందున పెద్ద సంఖ్యలో కార్మికులు పనుల్లో చేరుతున్నారు. ఇంకా నాలుగులక్షల మందికి పైగా కార్మికుల అవసరం ఉందని పరిశ్రమల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి.
తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో పరిశ్రమల ఏర్పాటును నిషేధించింది. నగరానికి దూరంగా 26 కొత్తగా పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేసింది. ఇవన్నీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. పారిశ్రామిక పార్కుల కోసం రహదారులను నిర్మించింది. వాటిల్లో నీరు, విద్యుత్, ఇతర మౌలిక వసతులను కల్పించింది. కార్మికుల వసతులకు మాత్రం ఇబ్బందులున్నాయి. పారిశ్రామిక పార్కులకు రవాణా వసతి లేదు. బస్సులు, ఆటోలు వెళ్లడం లేదు. దీంతో కార్మికులు దూరంగా ఉన్న బస్‌స్టాప్‌ల వద్ద, ఆటో స్టాండ్ల వద్ద దిగి పరిశ్రమలకు వస్తున్నారు.
ముందుకెళ్లని ప్రతిపాదనలు: కొత్త పారిశ్రామికపార్కుల ఏర్పాటు సందర్భంగా కార్మికులకు నివాస వసతి గురించి పరిశ్రమల సంఘాలు, యాజమాన్యాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు వీటిపై స్పందించి... పారిశ్రామికపార్కుల వద్ద టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సమీకృత టౌన్‌షిప్ విధానంలో దీనిని చేర్చారు. దీనికి అనుగుణంగా ఎక్కువ విస్తీర్ణం గల పారిశ్రామిక పార్కుల్లో కొంత స్థలాన్ని టౌన్‌షిప్‌ల కోసం ఏర్పాటు చేసి ఇళ్లను నిర్మించాలని ప్రతిపాదించారు. తక్కువ విస్తీర్ణం గల ప్రాంతాల్లో కార్మికులకు కనీస వసతులతో కూడిన డార్మెటరీ తరహా గదులను నిర్మించాలని భావించారు. దీనిలో భాగంగా కుత్బుల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మాదాపూర్, వరంగల్‌లలో పారిశ్రామిక టౌన్‌షిప్‌ల ఏర్పాటు, దండుమల్కాపూర్‌లోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పార్కులోనూ టౌన్‌షిప్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇప్పటి వరకు నిర్మాణాలు ప్రారంభం కాలేదు.
దండుమల్కాపూర్ పారిశ్రామిక పార్కులోని పరిశ్రమలో శ్రీనివాస్ కార్మికుడు. అక్కడికి 45 కిలోమీటర్ల దూరం నుంచి రోజూ అక్కడికి వస్తూ, పోతున్నారు. పార్క్‌కు సమీపంలో ఉండడానికి ఇళ్లు లేకపోవడంతో రోజూ రాకపోకలకు ఇబ్బంది అవుతోందని తెలిపారు.
సుల్తాన్‌పూర్‌లోని వైద్యపరికరాల పార్కులోని యంత్రాల తయారీ పరిశ్రమలో పనిచేసే రాజం అక్కడికి 30 కిలోమీటర్ల దూరంలోని సంగారెడ్డి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు.
నివాస వసతి కల్పించాలి: పారిశ్రామిక పార్కులతో పాటు టౌన్‌షిప్‌ల ఏర్పాటు అటు కార్మికులతో పాటు ఇటు పరిశ్రమలకు ప్రయోజనకరం. నివాస వసతుల్లేక కార్మికులు కార్యాలయ వేళల మాదిరే పనిచేస్తున్నారు. రెండు, మూడు షిప్ట్‌ల్లో పనిచేసే అవకాశం ద్వారా పరిశ్రమల్లో ఉత్పత్తులు పెరగడంతో పాటు కార్మికులకు మరింత ఉపాధి లభించే అవకాశం ఉంది. ప్రభుత్వం పారిశ్రామిక విధానంలోనూ దీనిని చేర్చాలి. - దామోదరాచారి, పారిశ్రామికవేత్త
నూతన భారీ ప్రాజెక్టుల్లో ఏర్పాటుకు చర్యలు: తెలంగాణలో కొత్తగా ఏర్పాటయ్యే ప్రతి భారీ ప్రాజెక్టు వద్ద టౌన్‌షిప్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ ఔషధనగరిలో పెద్దఎత్తున టౌన్‌షిప్‌లుంటాయి. జహీరాబాద్ నిమ్జ్‌లోనూ దీనిని ప్రతిపాదించాం. దండుమల్కాపూర్‌లో ప్రాజెక్టుపై కార్యాచరణ మొదలైంది. కార్మికుల వసతి దృష్ట్యా కాలుష్యరహితంగా అన్ని పారిశ్రామిక పార్కులను తీర్చిదిద్దుతున్నాం. - వెంకటనర్సింహారెడ్డి, టీఎస్‌ఐఐసీ ఎండీ
ఇవీ చదవండి: POLICE APP: యాప్ పసిగట్టింది..బుల్లెట్ దొరికింది
నీట్ పరీక్షలో విద్యార్థినులకు ఇబ్బందులు.. లోదుస్తులు తీసేస్తేనే ఎంట్రీ!