రాష్ట్రంలో మెజార్టీ ప్రజానీకం ఆధారపడిన వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం వివిధ చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. నూతన సాంకేతికతలను వినియోగించి మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో ఉంది. డిజిటల్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐవోటీ, డ్రోన్లు, ఉపగ్రహ ఛాయాచిత్రాల వంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్‌లను విస్తృతంగా వినియోగించడం ద్వారా రైతుల ఉత్పత్తి, ఉత్పాదకత, లాభాలను పెంచాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. వ్యవసాయం, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన వాల్యూ చెయిన్‌లోని విభాగాలను పెంపొందించడం.. రైతులు, భాగస్వాములకు ఎక్కువ ప్రయోజనం కల్పించాలన్నది సర్కారు ఆలోచన.
ఈ క్రమంలోనే కొత్త సాంకేతికతలను విజయవంతంగా, విస్తృతంగా అమలు చేసేందుకు కీలకమైన డేటాపై ప్రభుత్వం దృష్టి సారించింది. వ్యవసాయానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించడం, దానిని ప్రాసెస్ చేయడం, ఇతరులతో పంచుకోవడం.. ఆ సమాచారాన్ని వినియోగించుకునేలా అనుకూలమైన, విధానపరమైన వాతావరణాన్ని కల్పించే దిశగా ఓ అడుగు ముందుకేసింది. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారికి సంబంధించిన సమాచారాన్ని ఇతరులకు పంచడం, వినియోగించడం తదితర అంశాలకు సంబంధించి కొత్త విధానాన్ని తీసుకొస్తోంది. సంబంధిత శాఖలైన వ్యవ సాయం, నీటి పారుదల, రెవెన్యూ, ప్రణాళిక శాఖల అధికారులు, రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ సెంటర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతి నిధులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులను సంప్రదించి ఇందుకోసం ఓ ముసాయిదా విధానాన్ని రూపొందించారు. అందుకు అనుగుణంగా వ్యవసాయ డేటా నిర్వహణా విధానం 2022 ముసాయిదాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
ప్రతి ఏటా నివేదికలు..: సాగుభూమి, పంటపొలాలు, రైతు ఆర్థికస్థితి, వ్యవసాయ యంత్రాలు, బీమా, నీటి నిర్వహణ, భూసార సామర్థ్యం, పంటలు, పెట్టుబడి, వంగడాలు, ఎరువులు, పురుగు మందులు తదితర సంపూర్ణ సమాచారం సేకరణ, వాటి వినియోగం విధానాలను ముసాయిదాలో పొందుపరిచారు. ముసాయిదాపై రైతులు, సంబంధిత వర్గాల నుంచి ప్రభుత్వం సలహాలు, సూచనలు స్వీకరించనుంది. వాటిని ఆన్‌లైన్ ద్వారా ఆగస్టు 6 వరకు అందించవచ్చు. వ్యవసాయ డేటా నిర్వహణా విధానానికి లోబడి రైతులు, పంటలు, ఉత్పత్తుల సమాచారాన్ని కొత్త కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలతో ముందుకొచ్చే సంస్థలతో ప్రభుత్వం పంచుకుంటుంది. నిర్దేశిత అవసరాలకు మాత్రమే సదరు సంస్థలు ఆ సమాచారాన్ని వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి.. ఆయా సంస్థల నుంచి ప్రభుత్వం ప్రతి ఏటా నివేదికలు తీసుకుంటుంది.
పంట పొలాల సర్వేకు శ్రీకారం..: పంట మొదటి నుంచే సలహాలు, సూచనలు ఇవ్వడం.. ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం.. రైతులు పండించే పంటలకు అదనపు విలువను జోడించడం తదితరాల ద్వారా మెరుగైన ప్రయోజనం దక్కేలా చూడటం ప్రభుత్వ ఆలోచన. ఈ దిశగా సర్కార్ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పంట పొలాల సర్వేకు సర్కార్ శ్రీకారం చుట్టింది. గతంలో గూగుల్ సంస్థతో రాష్ట్ర ఐటీ శాఖ చేసుకున్న ఒప్పందానికి అనుగుణంగా గూగుల్ మ్యాప్స్ సాయంతో తక్కువ ఎత్తు నుంచి పంట పొలాలను ఫొటోలు తీసి నిర్ధారించి.. పంట సరిహద్దులను నిర్ధారిస్తారు.
పైలట్ ప్రాజెక్టుగా సంగారెడ్డి..: సంగారెడ్డి జిల్లాలో పైలట్ పద్ధతిన ఈ విధానాన్ని చేపట్టారు. 30 సెంటీమీటర్ల దూరం నుంచి పంట పొలాల ఫొటోలు తీసి.. వాటిని రైతులు నిర్ధారించిన తర్వాత ఫీల్డ్ సెగ్మెంటేషన్ చేస్తారు. పైలట్ పద్ధతి విజయవంతం అయిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేస్తారు. తద్వారా పంట పొలాల డేటాను గూగుల్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తుంది. ఆయా ప్రాంతాల్లో పండుతున్న పంటలు, విస్తీర్ణం, రకాలు, నాణ్యత, ఉత్పాదకత సహా సమగ్ర సమాచారానికి ఆ డేటా ఉపకరిస్తుంది. ఏఐ సాయంతో ఆ డేటాను వివిధ రకాలుగా వినియోగించుకునే అవకాశం కలుగుతుంది.
ఇవీ చూడండి..
వ్యవసాయ మోటార్లకు మీటర్లపై కేంద్రం వెనకడుగు
గ్రేటర్‌పై వైరల్ పంజా.. ఆసుపత్రులకు క్యూకడుతున్న రోగులు..
పెట్రోల్ బంక్‌లో బైక్‌కు మంటలు.. పక్కకు తీసుకెళ్లేసరికి మరింతగా..