TS WEATHER REPORT TODAY: రాష్ట్రంలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
రేపు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఎల్లుండి రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతోనే భారీవర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
హైదరాబాద్‌లో మళ్లీ..: మరోవైపు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. చంపాపేట్, కర్మన్‌ఘాట్, సరూర్‌నగర్, కొత్తపేట, వనస్థలిపురం, ఎల్బీనగర్, హయత్‌నగర్, నాగోల్, మన్సూరాబాద్, మీర్‌పేట్, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, తిరుమలగిరి, బేగంపేట్, అల్వాల్, ప్యాట్నీ, చిలకలగూడ, లాలాపేట, నాచారం, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, బాగ్‌లింగంపల్లి, బోలక్‌పూర్, కవాడిగూడ, జవహర్‌నగర్, రాంనగర్, దోమలగూడ, అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట, లింగోజీగూడ, ఖైరతాబాద్, లాలాపేట, నాచారం ప్రాంతాల్లో కురిసిన వర్షానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఏకధాటిగా గంటసేపు కురిసిన వర్షానికి లింగోజీగూడా, కర్మన్‌ఘాట్ నుంచి సరూర్‌నగర్ వెళ్లే దారిలో నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులుపడ్డారు. లింగోజీగూడా సాయినగర్ కాలనీ, చైతన్యపురి, కమలానగర్‌లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. భారీ వర్షానికి మూసీ ఉప్పొంగుతోంది. ఫలితంగా మూసారాంబాగ్ నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. మలక్పేట వంతెన కింద భారీగా వర్షం నీరు నిలిచిపోయింది. రోడ్లపై నిలిచిన వరద నీటితో వాహనదారులు ఇబ్బందులుపడ్డారు.
ఎల్బీనగర్, మన్సూరాబాద్, నాగోల్, వనస్థలిపురం, మీర్‌పేట్, బడంగ్‌పేట్, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలో ఉదయం నుంచి వర్షం కురిసింది. రోడ్లపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది. నాగోల్‌లోని అయ్యప్ప కాలనీలో పలు ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో కాలనీవాసులు ఇబ్బందులు పడ్డారు. ఇళ్లలోకి చేరిన వరద నీటిని మోటార్ల సాయంతో బయటకు పంపించారు.
ఇవీ చూడండి..
రేపు యాదాద్రి సందర్శించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్
'అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయట్లేదు'.. గహ్లోత్ ప్రకటన.. సోనియాకు క్షమాపణ