Tent Tourism in Telangana : వేల ఎకరాల విస్తీర్ణం.. ఎటువైపు చూసినా పచ్చదనం.. ఇలాంటి ప్రాంతాల్లో పక్షుల కిలకిలలు.. స్వచ్ఛమైన గాలి వీస్తుంటే కాసేపు గడపాలి అని అందరికీ ఉంటుంది. పగటి పూట ఉండొచ్చు కానీ.. చీకటి సమయంలో అంటే ప్రతి ఒక్కరు భయపడతారు. అమ్మో అడవిలో అని అంటాం. కొంతమందికి చీకటి వేళల్లో అక్కడ బస చేయాలి అనిపిస్తుంటుంది. అలాంటి వారి కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.
అడవిలో రాత్రి బస చేసి.. చీకట్లో జీపు ప్రయాణం చేస్తుంటే ఆ అనుభవం మరవలేనిది. సరిగ్గా ఇలాంటి అనుభూతులు అందించేందుకు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఏర్పాట్లు చేస్తుంది. పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సూచనల మేరకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. అటవీశాఖతో కలిసి ప్రజలకు సరికొత్త ఆకర్షణ అందించాలని టూరిజం కార్పొరేషన్ టార్గెట్. ఇందులో భాగంగా మొదట అనంతగిరిహిల్స్, నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం, పాలమూరులో కేసీఆర్ పార్కు అటవీప్రాంతాలను గుర్తించారు. సోమశిల ప్రాజెక్టు, మల్లన్నసాగర్, లక్నవరం వంటి ప్రకృతి-జల పర్యాటక ప్రాంతాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
టెంట్ సిటీ మాదిరి..: దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం వారణాసిలో గంగానది ఒడ్డున నిర్మించిన టెంట్ సిటీ మాదిరి తెలంగాణలోనూ పర్యాటకాభివృద్ధి చేయాలని నిర్ణయించారు. గత నెలలో శ్రీనివాస్‌గౌడ్ స్వయంగా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. పర్యాటకాభివృద్ధిలో ప్రాథమికంగా ఎంపిక చేసిన బుద్ధవనం, నాగార్జునసాగర్, మహబూబ్‌నగర్‌లోని కేసీఆర్ అర్బన్ ఎకో టూరిజం పార్కు హైదరాబాద్‌కు దగ్గరి ప్రాంతాలే కావడంతో దేశ, విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించవచ్చని అధికారులు యోచిస్తున్నారు. దీంతో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని అధికారులు భావిస్తున్నారు.
టెంట్ సిటీని నిర్మించిన గుజరాత్‌కు చెందిన లల్లూజి కంపెనీతో అధికారులు చర్చలు జరిపారు. ఆ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు రాష్ట్ర అటవీ శాఖ అధికారులను కలిసినట్లు తెలుస్తోంది. మరో సంస్థ కూడా దీనిపై ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. అధికారులు ఎంపిక చేసిన సంస్థనే గుర్తించిన ప్రాంతాల్లో టెంట్ వసతిని ఏర్పాట్లు చేస్తుందని టూరిజం కార్పొరేషన్ వర్గాలు తెలిపాయి. వారి ఎంపిక కోసం త్వరలోనే టెండర్ల ప్రక్రియను చేపడతారని సమాచారం.
నైట్ సఫారీ: మహబూబ్‌నగర్‌లోని కేసీఆర్ అర్బన్ ఎకో టూరిజం పార్కు ఏకంగా 2,500 ఎకరాల్లో ఉంది. దీనిలో పర్యాటకులకు నైట్ సఫారీ ఏర్పాటు చేయాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికారులకి తెలిపారు. 6 కిలోమీటర్ల జీప్‌లో నైట్ సఫారీ ఏర్పాటుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. అటవీ శాఖకు సంబంధించిన జీపుల్లోనే ప్రకృతి పర్యాటకుల్ని రాత్రి వేళ సఫారీకి తీసుకెళ్తారు.
ఆధునిక టెంట్లతో వసతి ఏర్పాటు చేస్తారు. పడక గది, బాత్‌రూం వంటి సౌకర్యాలు ఉంటాయని.. బయటకు మాత్రం టెంట్ ఆకారంలో కనిపిస్తుందని.. పాములు, జంతువులు, ఇతరత్రా సమస్యలేమీ తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని టూరిజం కార్పొరేషన్ వర్గాలు తెలిపాయి. నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం ప్రాజెక్టు ప్రాంతంలో పెద్ద అడవి ఉంది. అందులో వివిధ రకాల జంతువులు, పక్షులు సంచరిస్తుంటాయి. పక్కనే ఉన్న కృష్ణా నది అందాలు కనువిందు చేస్తాయి. ఇంతటి కీలకమైన చోట టెంట్ టూరిజం ఏర్పాటు చేస్తే విదేశీ పర్యాటకుల్నీ ఆకర్షిస్తుందని అధికారులు చెబుతున్నారు.
ఇవీ చదవండి: