పోలవరానికి 1.11 లక్షల ఎకరాల సేకరణ
పోలవరం నిర్మాణానికి 1.67 లక్షల ఎకరాలను గుర్తించగా 1.11 లక్షల ఎకరాలను సేకరించినట్లు కేంద్రం తెలిపింది. భూసేకరణకు రూ.11,317 కోట్ల అంచనా వ్యయం కాగా రూ.5570 కోట్లు ఖర్చు చేసినట్లు కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సోమవారం రాజ్యసభలో తెలిపారు. 1,05,601 కుటుంబాలకు పునరావాసం, పరిహారం కల్పించాల్సి ఉందని, ఇది 3922 కుటుంబాలకు పూర్తయిందని తెలిపారు. ఎర్త్‌కం రాక్‌ఫిల్ డ్యాం (ఈసీఆర్‌ఎఫ్ గ్యాప్-1) పనులు ఫిబ్రవరి 2021 నుంచి అక్టోబరు 2021 మధ్య చేయాలని నిర్ణయించినట్లు ఏపీ ప్రభుత్వం సమాచారమిచ్చిందని తెలిపారు.
నా పోరాటం ఫలించలేదు: రాజ్యసభ వీడ్కోలు ప్రసంగంలో కేవీపీ
సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం తాను చేసిన పోరాటం ఫలించలేదని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్లకార్డు పట్టుకొని వెల్‌లో తాను నిల్చొన్న సమయం రికార్డు మాత్రం ఎప్పటికీ చెరిగిపోదని అన్నారు. ఏప్రిల్ 9న పదవీ విరమణ చేయనున్న కేవీపీ సోమవారం రాజ్యసభలో వీడ్కోలు ప్రసంగం చేశారు. ‘విద్యార్థి రాజకీయాల నుంచి పార్టీ రాజకీయాల వరకు ఒకే పార్టీలో కొనసాగాను. రాజ్యసభ సభ్యుడు కావాలన్న నా కల మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ వల్ల నెరవేరింది. సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం చేసిన పోరాటం ఫలించకపోవడం దురదృష్టకరం. తెలంగాణ పౌరుడిగా ఆ రాష్ట్రంలో స్థిరపడుతున్నందుకు సంతోషంగా ఉంది. పార్లమెంటులో అడుగుపెట్టే సమయంలో మెట్లకు నమస్కరించిన ప్రధాని మోదీ విభజన హామీలు మాత్రం అమలు చేయలేదు. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని ప్రధాని, హోంమంత్రులు ఉభయసభల్లోనూ పలుమార్లు చెప్పారు. రాష్ట్రానికి వారు న్యాయం చేయాలని కోరుతున్నా. బరువెక్కిన హృదయంతో ఈ సభను వీడుతున్నా. రాజకీయాల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నాకు స్ఫూర్తి. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేసే విషయంలో చైర్మన్‌గా వెంకయ్యనాయుడు తోడ్పాటు అందించాలని కోరుతున్నా’’ అని కేవీపీ పేర్కొన్నారు.
- దేశ హితం కోసం పార్టీలో తుది వరకు పనిచేస్తానని కాంగ్రెస్ సభ్యుడు ఎంఏ ఖాన్ తెలిపారు. రాజ్యసభలో ఆయన వీడ్కోలు ప్రసంగం చేశారు. పార్టీ ఆదేశాల మేరకు సిపాయిలా పనిచేశానన్నారు.
పదవీ విరమణ: తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆరుగురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఏప్రిల్‌లో ముగియనుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి కేశవరావు (తెరాస), ఎంఏ ఖాన్, టి.సుబ్బరామిరెడ్డి (కాంగ్రెస్), తోట సీతారామలక్ష్మి(తెదేపా), తెలంగాణ నుంచి కేవీపీ రామచంద్రరావు (కాంగ్రెస్), గరికపాటి మోహన్‌రావు(తెదేపా)ల పదవీ కాలం ముగియగా వీరిలో కేశవరావు ఒక్కరే మళ్లీ తెలంగాణ నుంచి సభ్యుడిగా ఎన్నికయ్యారు.
ఇవీ చదవండి: మీరు సన్నద్ధంగా ఉన్నారా?