తెలంగాణ సమాజం రాచరికం నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి ప్రవేశించి 75వ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా ఈ నెల 17వ తేదీని తెలంగాణ జాతీయ సమైక్యత దినంగా పాటించాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. 16, 17, 18 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ప్రారంభ కార్యక్రమాలను, 2023 సెప్టెంబరు 16, 17, 18 తేదీల్లో ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని తీర్మానించింది. ఈ నెల 17న సీఎం కేసీఆర్ హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగిస్తారు. అదే రోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు, నగర, పురపాలక, పంచాయతీ కేంద్రాల్లో, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో శనివారం మూడు గంటలపాటు జరిగిన మంత్రిమండలి భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
* గిరిజనుల పోడు భూముల సమస్య పరిష్కారానికి ఆయా జిల్లాల రెవెన్యూ, అటవీ, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో మంత్రుల అధ్యక్షతన ప్రతి జిల్లాలో సమన్వయ సమావేశాలను నిర్వహించాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఈ సమావేశాల్లో దరఖాస్తులను పరిశీలించి వాటిపై తుది నిర్ణయం కోసం ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని నిర్దేశించింది. సత్వరమే దీనిపై చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు సూచించింది.
* ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్కో నియోజకవర్గంలో 1500 మందికి దళితబంధు పథకం వర్తింపజేయాలని.. మొదటి దశలో ఒక్కోచోట 500 మంది చొప్పున 118 నియోజకవర్గాల్లో(హుజూరాబాద్‌లో ఇప్పటికే అమలు) అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని తీర్మానించింది.
* రాష్ట్రంలోని హైదరాబాద్ మహానగరపాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ)తో పాటు ఇతర నగరపాలికల్లో కోఆప్షన్ సభ్యుల సంఖ్యను పెంచాలని మంత్రిమండలి నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీలో 5 నుంచి 15కి.. ఇతర కార్పొరేషన్లలో 5 నుంచి 10కి కోఆప్షన్ సభ్యుల పెంపుదలకు ఆమోదం తెలిపింది.
* సుంకిశాల నుంచి హైద్రాబాద్ నగరానికి నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరచాలని సూచించింది. అందులో భాగంగా అదనంగా 33 టీఎంసీల నీటిని శుద్ధి చేసి సరఫరా చేసేందుకు రూ.2,214.79 కోట్లను మంజూరు చేసింది.
* నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా కోర్టుల భవనాల నిర్మాణాల కోసం 21 జిల్లా కేంద్రాల్లో స్థలాల కేటాయింపు.
* అటవీ విశ్వవిద్యాలయానికి కొత్త పోస్టుల మంజూరు.
* భద్రాచలం ముంపు ప్రాంతాల్లోని 2,016 కుటుంబాలకు కాలనీల నిర్మాణం.
స్వతంత్ర భారత వజ్రోత్సవాల విజయవంతంపై అభినందనలు
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణలో గత నెలలో పక్షం రోజుల పాటు నిర్వహించిన స్వతంత్ర భారత వజ్రోత్సవాలు విజయవంతం కావడంపై మంత్రిమండలి హర్షం వ్యక్తంచేసింది. వీటి నిర్వహణలో పాల్గొన్న ప్రభుత్వ యంత్రాంగానికి అభినందనలు తెలిపింది. ఇదే స్ఫూర్తితో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.
ప్రారంభ కార్యక్రమాలు ఇలా..
* ఈ నెల 16న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు.
* 17న బంజారా, ఆదివాసీ భవన్‌ల ప్రారంభోత్సవం. నక్లెస్‌రోడ్డు నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు భారీ ఊరేగింపు. సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా బహిరంగ సభ.
* 18న అన్ని జిల్లా కేంద్రాల్లో స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానాలు, కవులు, కళాకారులకు సత్కారం, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ.