TRS TO BRS: ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. జాతీయ పార్టీగా అడుగు ముందుకేసింది. తెరాస పేరు, పార్టీ రాజ్యంగంలోని మౌలిక అంశాలను సవరిస్తూ సర్వసభ్య సమావేశం తీర్మానం చేసింది. విజయమే లక్ష్యంగా ప్రణాళికలు చేస్తున్న కేసీఆర్... జాతీయ పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితి అని ఖరారు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన, తెలంగాణ అభివృద్ధి వంటి మౌలిక ఉద్దేశాలతో తెరాస ఆవిర్భవించగా.. వాటిని జాతీయ పార్టీకి అనుగుణంగా మార్చారు.
జాతీయ పార్టీ ప్రకటన కోసం తెలంగాణ భవన్‌లో జరిగిన తెరాస సర్వసభ్య సమావేశంలో... మంత్రులు, తెరాస ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్‌పర్సన్లు సహా 283 మంది కీలక ప్రతినిధులు పాల్గొని... తీర్మానాలపై సంతకాలు చేశారు. పేరును మారుస్తూ తెరాస అధినేత ప్రతిపాదించిన ఏక వాక్య తీర్మానానికి సభ్యులు మద్దతు తెలిపారు.
అనంతరం ఆ తీర్మానంపై కేసీఆర్ సంతకం చేశారు. ఆ తర్వాత ఆయన చదివి వినిపించి ‘భారత్ రాష్ట్ర సమితి’పేరును ప్రకటించారు. కేసీఆర్ పార్టీ పేరు మార్పును ప్రకటించగానే సమావేశంలో సభ్యులంతా చప్పట్లతో మద్దతు పలికారు. జాతీయ పార్టీ ప్రకటన వేళ తెరాస కీలక భేటీకి ఇతర రాష్ట్రాల నుంచి పలువురు నేతలు హాజరయ్యారు.
కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి, తమిళనాడులో దళిత ఉద్యమ పార్టీగా పేరున్న వీసీకే అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు తిరుమవళం, రైతు సంఘం నేతలు హాజరై సంఘీబావం తెలిపారు. జాతీయ పార్టీ ప్రకటించగానే.. కుమారస్వామి కేసీఆర్‌ను సన్మానించారు. సమావేశం అనంతరం పార్టీ పేరు మార్పుపై కేంద్ర ఎన్నికల సంఘానికి కేసీఆర్ లేఖ రాశారు.
గుజరాత్ మోడల్ విఫలమైందని తెలంగాణ మోడల్ దేశమంతా కావాలనే నినాదంతో భారాస ముందుకెళ్లనుందని నేతలు చెబుతున్నారు. తెలంగాణలోని పథకాలను విస్తృతంగా ప్రచారం చేసి.. భారాసకు మద్దతుగా నిలిస్తే దేశమంతా చేసి చూపిస్తామని ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఇవీ చదవండి..