Telangana Parliament Incharges Meet in Delhi : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు పావులు కదుపుతోంది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకునేందుకు వీలుగా రాష్ట్రంలో పార్టీ శ్రేణులు, నాయకులు పని చేయాలని ఏఐసీసీ(AICC) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. దిల్లీలో వివిధ రాష్ట్రాల పార్లమెంటు నియోజకవర్గాల సమన్వయకర్తలతో సమావేశం జరిగింది. ఈ సమావేశాల్లో లోక్‌సభ ఎన్నికల్లో గెలుపునకు వ్యవహరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
ఈ సమావేశం అనంతరం తెలంగాణ లోక్‌సభ ఇంఛార్జ్‌లతో ఖర్గే, రాహుల్ గాంధీ(Rahul Gandhi), కేసీ వేణు గోపాల్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ గెలుపునకు ఎలా ముందుకు వెళ్లాలో దిశానిర్దేశం చేశారని తెలుస్తోంది. ఎక్కువ స్థానాలు గెలిచేందుకు అవసరమైన ప్రణాళికలు రూపకల్పన చేసుకుని పక్కా కార్యాచరణతో ముందుకెళ్లాలని స్పష్టం చేశారనే సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించినట్లే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) విశ్వాసం వ్యక్తం చేశారు.
"కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో, అత్యధిక స్థానాలు గెలిపించుకోవడానికి వ్యూహరచన ప్రణాళికలపై సూచనలు చేశారు. దానికి అనుగుణంగా రాష్ట్రంలో పార్టీ యాక్సన్ ప్లాన్ తయారు చేసుకొని ముందుకు పోతుంది. అత్యధిక స్థానాలను గెలవడం కోసం కాంగ్రెస్ పార్టీ టార్గెట్‌గా పెట్టుకుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు భారీ మెజారిటీతో గెలిపిస్తారు. దేశ వనరులను కొన్ని కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు." - భట్టి విక్రమార్క, ఉపముఖ్యమంత్రి
AICC Meeting in Delhi : తెలంగాణలో సోనియాగాంధీ పోటీచేయాలని రాష్ట్రా నాయకత్వం ఏఐసీసీకి విజ్ఞప్తి చేసింది. రాజకీయ వ్యవహారాల కమిటీలో, పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో రెండింటిలోనూ సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం నుంచి పోటీ చేయాలని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అనంతరం ఆ తీర్మానాలను ఏఐసీసీకి రాష్ట్ర నాయకత్వం నివేదించింది. దీనిపై ఆమె సానుకూలంగా స్పందిస్తారని ఎదురు చూస్తోంది. ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గాల నుంచి ఎక్కడైనా పోటీ చేసేందుకు అనుకూల వాతావరణం ఉన్నట్లు దిల్లీ పెద్దలక దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
పార్లమెంట్ ఎన్నికలకు కసరత్తు ముమ్మరం చేసిన కాంగ్రెస్ - తాజా పరిస్థితులపై అధిష్ఠానానికి నివేదిక!
పార్లమెంటు ఎన్నికలో పోటీ చేసేందుకు అవకాశం ఉన్న కాంగ్రెస్ ఆశావహులు : అలాగే రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఉన్న ఆశావహులను వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ నుంచి నరేష్ జాదవ్, సేవాలాల్ రాథోడ్, పెద్దపల్లి నుంచి గడ్డం వివేక్ కుమారుడు గడ్డం వంశీ, మాజీ మంత్రి ఏ. చంద్రశేఖర్‌లు టికెట్లు ఆశిస్తున్నారు. అదే విధంగా కరీంనగర్ నుంచి ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ లేదా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. నిజామాబాద్ నుంచి మహేశ్‌కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఈరావత్రి అనిల్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలు టికెట్లు ఆశిస్తున్న వారిలో ఉన్నారు. జహీరాబాద్ నుంచి సురేశ్ షెట్కర్, మెదక్ నుంచి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఆయన భార్య నిర్మలా రెడ్డిలను బరిలో దించే అవకాశం ఉంది.
Telangana Lok Sabha Candidates List 2024 : మల్కాజిగిరి నుంచి హరివర్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావులు టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. సికింద్రాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యే, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్‌లు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. హైదరాబాద్ నుంచి ఫిరోజ్‌ఖాన్ లేదా అజారుద్దీన్ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. చేవెళ్ల నుంచి చిగురింత పారిజాత రెడ్డి కాని, మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ కాని పోటీ చేసే అవకాశం ఉంది.
మహబూబ్‌నగర్ నుంచి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి, చిన్నారెడ్డి కుమారుడు ఆదిత్య రెడ్డిలు టికెట్ ఆశిస్తున్నారు. ఇక నాగర్‌కర్నూల్ నుంచి మాజీ ఎంపీ, పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, పీసీసీ ప్రధాన కార్యదర్శి చారకొండ వెంకటేశ్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. సూర్యాపేట నుంచి టికెట్ ఆశించి నిరాశకు లోనైన పటేల్ రమేశ్ రెడ్డికి నల్గొండ పార్లమెంటు టికెట్ ఇస్తామని ఏఐసీసీ హామీ ఇచ్చి ఉంది. అయితే ఇక్కడి నుంచి మాజీ మంత్రి సీనియర్ నాయకుడు జానారెడ్డి బరిలో దిగుతారని ఉందని పేర్కొంటున్న కాంగ్రెస్ వర్గాలు పటేల్ రమేశ్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నాయి.
Lok Sabha Election 2024 : భువనగిరి నుంచి పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్ రెడ్డి, వరంగల్ నుంచి అద్దంకి దయాకర్, సిరిసిల్ల రాజయ్యలతోపాటు సర్వే సత్యనారాయణ కూడా పోటీ చేసేందుకు చొరవ చూపుతున్నారు. మహబూబాబాద్ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరామ్ నాయక్, ఆదివాసీ రాష్ట్ర అధ్యక్షుడు బెల్లయ్య నాయక్, నెహ్రు నాయక్‌లు టికెట్ ఆశిస్తున్నారు. ఖమ్మం నుంచి సోనియాగాంధీ పోటీ చేస్తారని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నప్పటికీ ఆమె నిరాకరిస్తే అక్కడ నుంచి పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతురావు, రాజేంద్ర ప్రసాద్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో 12సీట్లకు తగ్గొద్దన్న రేవంత్ రెడ్డి, ఈనెల 26 తర్వాత జిల్లాల పర్యటనలు
టార్గెట్ 2024- 500 స్థానాల్లో కాంగ్రెస్ సర్వే! సీట్ల పంపకం చర్చలకు ముందే!