కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ భూభాగం ముంపునకు గురికాకుండా అధ్యయనం చేయించడం తదితర అంశాలను దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఎజెండాగా పెట్టాలని తెలంగాణ కోరింది. అంతర్రాష్ట్ర జల వివాద చట్టంలోని సెక్షన్-3 ప్రకారం తెలంగాణ చేసిన ఫిర్యాదు; పోలవరం, పట్టిసీమల ద్వారా కృష్ణాబేసిన్‌కు మళ్లించే నీటిలో ట్రైబ్యునల్ అవార్డు ప్రకారం వాటా; ఆర్డీఎస్ ఆధునికీకరణ సహా పలు అంశాలను చేర్చాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు విజ్ఞప్తి చేసింది. తాగునీటి వినియోగంలో 20 శాతాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం, ఒక సంవత్సరం కేటాయించి వినియోగించుకోలేని నీటిని తర్వాత సంవత్సరానికి క్యారీఓవర్ స్టోరేజీగా అనుమతించే అంశాలను కూడా చేర్చాలని కోరింది.
కేంద్రానికి పంపిన బోర్డు
కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన మార్చి నాలుగున తిరుపతిలో జరిగే దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఎజెండాలో ఉన్న తుంగభద్రపై గుండ్రేవుల బ్యారేజి నిర్మాణం, పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన వివరాలను తెలంగాణ నుంచి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కోరింది. ఈ అంశాలపై అభిప్రాయాన్ని చెప్పడంతోపాటు తమకు సంబంధించిన అదనపు అంశాలను కూడా ఎజెండాలో చేర్చాలని కోరుతూ తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ కృష్ణా బోర్డుకు లేఖ రాశారు. ఈ అంశాలను బోర్డు.. కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళ్లింది.
పాలమూరు-రంగారెడ్డి, డిండిలతో కర్ణాటకకు సంబంధం లేదు
‘‘మిగులు జలాలను వినియోగించుకొనే స్వేచ్ఛను బచావత్ ట్రైబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చింది. ఈ నీటి వినియోగంపై ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు. బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్.. బచావత్ ట్రైబ్యునల్ కేటాయింపులను కొనసాగిస్తూనే క్యారీ ఓవర్ స్టోరేజి కింద ఉన్న 150 టీఎంసీలను 65 శాతం, సరాసరి నీటి లభ్యత కింద కేటాయించింది. పునర్విభజన తర్వాత బేసిన్‌లో ఎక్కువ భాగం తెలంగాణలో ఉండటంతో పాటు కరవు ప్రాంతం కూడా ఇక్కడే ఉంది. లోటు కూడా ఎక్కువ. ఈ కారణాల దృష్ట్యా మొత్తం క్యారీ ఓవర్ లేదా ఎక్కువ భాగం క్యారీ ఓవర్ కేటాయింపు, మిగులు జలాలు కూడా మాకు దక్కాల్సి ఉంది. శ్రీశైలం ఎడమగట్టుకాలువ, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను మిగులు జలాల ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేపట్టింది కాబట్టి 75 శాతం నీటి లభ్యతకు బయట వీటికి కేటాయింపులు చేయాలని తెలంగాణ ఇప్పటికే ట్రైబ్యునల్‌ను కోరింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం మేరకు జరిగే విచారణలో కర్ణాటక, మహారాష్ట్రలకు సంబంధం లేదని 2016 అక్టోబరు 19న ట్రైబ్యునల్ ఇచ్చిన ఆర్డర్‌లో స్పష్టం చేసింది. దీనిప్రకారం క్యారీఓవర్, మిగులు జలాలకు సంబంధించిన అంశం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు మాత్రమే సంబంధించినది. కాబట్టి పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల విషయంలో కర్ణాటక లేవనెత్తిన అభ్యంతరానికి అర్థం లేదు’’ అని తెలంగాణ స్పష్టం చేసింది.
కేసీ కాలువకు పది టీఎంసీలే...
‘‘1944 జూన్‌లో మద్రాస్, హైదరాబాద్ రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం కేసీ కాలువకు ఉన్నది పది టీఎంసీలు మాత్రమే. అయితే ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తి మేరకు బచావత్ ట్రైబ్యునల్ కేసీ ఆయకట్టు రక్షణకోసం పది టీఎంసీలకు బదులుగా 39.9 టీఎంసీలు కేటాయించింది. ప్రసుత్తం ప్రాజెక్టుల వారీగా కేటాయింపులపై విచారణ నిర్వహిస్తున్న బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ దృష్టికి మేము ఈ అంశాన్ని తీసుకెళ్లాం. 29.9 టీఎంసీలను బేసిన్‌లోని అవసరాలకు కేటాయించాలని కోరాం. కేసీ కాలువకు ఉన్న పది టీఎంసీల వినియోగానికి ప్రస్తుతం ఉన్న సుంకేశుల బ్యారేజీ సరిపోతుంది. ఈ నేపథ్యంలో మా రాష్ట్రంలోని పలు గ్రామాలు ముంపునకు గురయ్యే గుండ్రేవుల ప్రాజెక్టుకు అంగీకారం తెలిపేది లేదు. ఈ అంశాలన్నింటినీ పక్కనబెట్టి ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన డీపీఆర్‌పై అభిప్రాయాలు కోరడం సరికాదు. మేము ఇచ్చిన సమాచారాన్నంతా దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశానికి తీసుకెళ్లాలి’’ అని తెలంగాణ కోరింది.
ఇదీ చూడండి: 'నికర ఆదాయం పొందడంపై రైతులు దృష్టి సారించాలి'