Telangana Inter Board news : రాష్ట్రంలో అనుబంధ గుర్తింపు పొందని ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు ముకుతాడు వేసేందుకు ఇంటర్‌బోర్డు ప్రణాళిక రచిస్తోంది. అందుకనువుగా వాటిలో చదివే విద్యార్థులతో ప్రైవేట్‌గా పరీక్షలు రాయించాలని భావిస్తోంది. ఇప్పటికీ 200 కళాశాలల అఫిలియేషన్ ప్రక్రియ పెండింగ్‌లో ఉండగా.. హైదరాబాద్‌లోని మరో 340కి పైగా కళాశాలలు గృహ, వాణిజ్య సముదాయాల్లో కొనసాగుతున్నాయి. వాటికి అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) రానందున బోర్డు అనుబంధ గుర్తింపు ఇవ్వలేదు. అంటే వాటిలోని విద్యార్థులు ఇంటర్‌బోర్డు లెక్కల్లోకి రారు. ఒకవేళ వాటికి ఈ ఏడాదికి మినహాయింపు ఇవ్వాలనుకుంటే ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఏటా ఇలా అనుమతి ఇస్తూపోతే ఇంక ముగింపు ఎప్పుడని బోర్డు ఇన్‌ఛార్జి కార్యదర్శి నవీన్ మిత్తల్ భావిస్తున్నట్లు సమాచారం. వాటికి ఈ విద్యా సంవత్సరం అనుమతి ఇవ్వకుండా..అదే సమయంలో వాటిలో చదివే దాదాపు లక్ష మంది విద్యార్థులను ప్రైవేట్‌గా పరీక్షలు రాయించాలని ఆయన భావిస్తున్నారు. అంటే రెగ్యులర్‌గా కళాశాలకు వెళ్లలేదని హాజరు మినహాయింపు తీసుకొని నేరుగా పరీక్ష రాయించే విధానం. ఇప్పటివరకు అది కేవలం ఆర్ట్స్ గ్రూపులకే పరిమితం. ఇప్పుడు అఫిలియేషన్ లేని కళాశాలల్లోని విద్యార్థుల్లో వేలమంది చదువుతోంది సైన్స్ గ్రూపులే. మరి వాటికి ఎలా అమలు చేస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈనెల 11న ఇంటర్‌బోర్డు పాలక మండలి సమావేశంలో దీనిపై చర్చించనున్నారు.
కళాశాలల అనుమతుల వ్యవహారం తేలితేనే పరీక్ష ఫీజులు చెల్లించే ప్రక్రియ మొదలవుతుంది. విద్యార్థుల పరంగా సున్నితాంశం అయినందున విద్యామంత్రి సబిత గత ఏడాది మాదిరిగానే అనుమతి ఇద్దామని భావిస్తున్నా అందుకు నవీన్ మిత్తల్ సముఖంగా లేరని తెలిసింది. మరోవైపు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ తన కంటే జూనియర్ అయినందున ఇంటర్‌బోర్డుకు సంబంధించిన పలు దస్త్రాలను ఆమెకు బదులు నేరుగా మంత్రికే పంపుతున్నట్లు సమాచారం.
మళ్లీ ఆన్‌లైన్ ప్రతిపాదన.. ప్రయోగాత్మకంగా ఇంటర్‌లో జవాబుపత్రాల మూల్యాంకనాన్ని ఆన్‌లైన్ విధానంలో జరపాలని బోర్డు ఆలోచన. గత ఏడాది కార్యదర్శిగా జలీల్ ఒక సబ్జెక్టును ప్రయోగాత్మకంగా ఆన్‌లైన్ మూల్యాంకనం చేస్తామని, అనుమతి కోరినా ప్రభుత్వం తిరిస్కరించింది. బోర్డు ఇన్‌ఛార్జి కార్యదర్శిగా వచ్చిన నవీన్ మిత్తల్ మళ్లీ దాన్ని తెరపైకి తెచ్చారు. దాన్నీ సమావేశం ఎజెండాగా పెడుతున్నట్లు సమాచారం. అంతేకాక, ఇప్పటికే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు అమలు చేయాలని బోర్డు నిర్ణయించింది. వచ్చే ఏడాది ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో విద్యార్థులందరికీ దాన్ని వర్తింజేయాలన్నది ప్రతిపాదన. ప్రైవేట్ కళాశాలల్లోని విద్యార్థులకూ ప్రభుత్వం ట్యూషన్ ఫీజును చెల్లిస్తున్నందున వారికీ బయోమెట్రిక్ హాజరు ఉండాలని భావిస్తున్నారు. పరీక్ష ఫీజునూ కొంత పెంచాలని బోర్డు ప్రతిపాదిస్తున్నట్లు తెలిసింది.
దాదాపు 2వేల అంశాలతో ఎజెండా.. చివరిసారిగా ఇంటర్‌బోర్డు పాలకమండలి సమావేశం 2017లో నిర్వహించారు. అంటే అయిదేళ్లు గడిచింది. బోర్డుకు ఛైర్మన్‌గా విద్యాశాఖ మంత్రి, వైస్ ఛైర్మన్‌గా విద్యాశాఖ కార్యదర్శి వ్యవహరిస్తారు. అయిదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న వందలాది అంశాలకు ఈనెల 11న సమావేశంలో బోర్డు ఆమోదం తీసుకోనున్నారు. మొత్తం 1500- 2000 అంశాలు ఎజెండాలో ఉన్నాయి.