TS Highcourt Notices to BRS : హైదరాబాద్ కోకాపేటలో అధికార బీఆర్ఎస్కు 11 ఎకరాల భూకేటాయింపుపై కౌంటర్లు దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి, బీఆర్ఎస్కు.. హైకోర్టు నోటీసులు ఇచ్చింది. నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. బీఆర్ఎస్కు భూ కేటాయింపుపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఇవాళ తాత్కాలిక సీజే జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ ఎన్.రాజేశ్వరరావు ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఈ దశలో విచారణ జరపడం సరికాదు : ఎకరానికి 50 కోట్ల రూపాయల విలువ ఉండగా.. కేవలం 3 కోట్ల 41 లక్షల రూపాయల చొప్పున కేటాయించారని పిటిషనర్ వాదన. భూకేటాయింపునకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ రహస్యంగా పెట్టారని వాదించారు. బీఆర్ఎస్కు భూమి కేటాయింపుపై కేబినెట్ ఆమోదం జరగాల్సి ఉందని అదనపు అడ్వకేట్ జనరల్ తెలిపారు. ఇంకా ప్రభుత్వ నిర్ణయం వెలువడనందున ఈ దశలో విచారణ జరపడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే ఆ భూమిలో పనులు కూడా ప్రారంభించారని, భూమి పూజ చేశారని పిటిషనర్ తరఫున న్యాయవాది వివరించారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, హెచ్‌ఎండీఏ, సీసీఎల్‌ఏ, రంగారెడ్డి కలెక్టర్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు.. విచారణను ఆగస్టు 16కి వాయదా వేసింది.
FGG Pil in Highcourt on Land allotment to BRS : బీఆర్ఎస్కు కోకాపేటలో 11 ఎకరాల భూమి కేటాయించడంపై ఈ నెల10న హైకోర్టులో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌జీజీ) పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కోకాపేటలో ఖరీదైన భూమిని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం కేటాయించారని పిల్‌లో పేర్కొంది. ఎకరానికి రూ.50 కోట్ల విలువైన భూమిని రూ.3.41 కోట్లకే కేటాయించారని.. కేవలం ఐదు రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేశారని వెల్లడించింది. భూ కేటాయింపు పత్రాలనూ రహస్యంగా పెట్టారన్న పిటిషనర్.. శిక్షణ, ఎక్సలెన్స్ కేంద్రం పేరిట బీఆర్ఎస్ భూమి పొందినట్లు తెలిపింది. బీఆర్ఎస్కు బంజారాహిల్స్‌లో పార్టీ కార్యాలయం ఉన్నప్పటికీ మళ్లీ భూమి కేటాయించారంది. ఈ మేరకు బీఆర్ఎస్కు భూ కేటాయింపు జీవోను రద్దు చేయాలని హైకోర్టును ఎఫ్‌జీజీ కోరింది. కోకాపేటలో నిర్మాణ పనులు జరపకుండా స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
పార్టీ నేతల శిక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న భవనం : ఇటీవలే కోకాపేటలో బీఆర్ఎస్ మానవ వనరుల కేంద్రానికి ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేసిన విషయం తెలిసిందే. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు శిక్షణ ఇచ్చేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ పేరుతో భారత్ రాష్ట్ర సమితి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం కోకాపేటలోని 239, 240 సర్వే నంబర్లకు చెందిన 11 ఎకరాల భూమిని బీఆర్ఎస్కు ఇటీవల మంత్రివర్గ సమావేశంలో కేటాయించారు. వీలైనంత త్వరగా నిర్మాణం చేపట్టాలన్న ఉద్దేశంతో వెంటనే భవన నిర్మాణం కోసం అనుమతులు తీసుకునే ప్రక్రియను చేపట్టారు. పార్టీ నేతలు, శ్రేణులకు శిక్షణ ఇవ్వడం, వసతి సౌకర్యం, గ్రంథాలయాలు, సెమినార్ హాల్స్ ఉండేలా ఈ భవనాన్ని నిర్మించనున్నారు.
ఇవీ చదవండి :