ముఖ్యమంత్రి సహా పాలక పక్షాలు లేదా గవర్నర్లు ఇచ్చిన హామీలు చట్టాలు కాజాలవని, వాటికి చట్టబద్ధత ఉండదని హైకోర్టు(TS High court news) శుక్రవారం స్పష్టంచేసింది. చట్టాన్ని రూపొందించడం/సవరించడం అనేది శాసనసభ పరిధిలోనిదని తేల్చిచెప్పింది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపునకు సంబంధించిన చట్టసవరణ కూడా శాసనసభ పరిధిలోనే జరిగిందని, దానికి సంబంధించిన అమలు తేదీలో జోక్యం అవసరంలేదని పేర్కొంది. పదవీ విరమణ వయసు పెంపు తేదీని పీఆర్‌సీ నివేదిక తేదీ నుంచి అమలు చేయాలంటూ దాఖలైన సుమారు 31 పిటిషన్‌లను కొట్టివేస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది.
ఈ ఏడాది మార్చి 30 నుంచి పదవీ విరమణ వయసును 58 నుంచి 61 ఏళ్లకు పొడిగిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో 45ను సవాలుచేస్తూ పలువురు విశ్రాంత ఉద్యోగులు పిటిషన్‌లు దాఖలుచేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం(TS High court news) విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ..‘‘పదవీ విరమణ వయసును పెంచుతామంటూ 2018లో తెరాసపార్టీ హామీ ఇచ్చింది. ఈ ఏడాది రిపబ్లిక్ దినోత్సవ ప్రసంగంలోనూ గవర్నరు ఇదే హామీ ఇచ్చారు. మొదటి పీఆర్‌సీ కమిటీ గత ఏడాది డిసెంబరు 31న ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. పీఆర్‌సీ సిఫార్సు చేసిన వేతనాలు, గ్రాట్యుటీ/పింఛను పెంపు తదితరాలన్నీ గత తేదీల నుంచి అమలు చేశారు. ఈ నేపథ్యంలో అదే తేదీ నుంచి/డిసెంబరు 31 నుంచి పదవీ విరమణ వయసు పొడిగింపును అమలు చేయాలి’ అని కోరారు. దీనికి సంబంధించి పలు సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావించారు.
వాదనలను విన్న ధర్మాసనం(TS High court news) తీర్పు వెలువరిస్తూ ముఖ్యమంత్రి లేదా పాలకపక్షాలు లేదా గవర్నరు ఇచ్చే హామీలకు చట్టబద్ధత లేదని పేర్కొంది. ‘‘పిటిషనర్లు ప్రస్తావించిన సుప్రీం తీర్పులు ఈ కేసుకు వర్తించవు. వాటిలో ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు తరగతులుగా ప్రయోజనాలు వర్తింపజేశారు. ఇక్కడ అందరికీ ఒకేసారి వర్తించేలా జీవో జారీఅయింది. సాధారణంగానే పదవీ విరమణ పొడిగింపు వయసు అమలు తేదీకి సంబంధించి ఉద్యోగుల్లో అసంతృప్తి ఉండటం సహజం. అయితే రాజ్యాంగలోని అధికరణ 14, 16, 21లకు సంబంధించి జరిగిన ఉల్లంఘనలను పిటిషనర్లు కోర్టు ముందు నిరూపించలేకపోయారు’ అని ధర్మాసనం స్పష్టంచేసింది. హామీలు, ప్రభుత్వ విధానాల అమలుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఈ సందర్భంగా ధర్మాసనం ప్రస్తావించింది. పదవీ విరమణ వయసు పొడిగింపు అమలు తేదీలో జోక్యం చేసుకోలేమని పేర్కొంటూ పిటిషన్‌లను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.
ఇదీ చదవండి: ఆ జన్యువుతో కరోనా మరణముప్పు రెట్టింపు- మనలోనే ఎక్కువట!