వరద బాధితులకు పరిహారం చెల్లింపు అంశం.. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులు, ఇతర వృత్తుల వారికి జాతీయ విపత్తు నియంత్రణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డా. చెరుకు సుధాకర్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి. విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.
ప్రభుత్వ విధానపరమైన విషయాల్లో తామెలా జోక్యం చేసుకుంటామని హైకోర్టు ప్రశ్నించింది. అయితే విపత్తుల విషయంలో ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయవచ్చునని.. గతంలో ఉత్తరాఖండ్ వరదల సమయంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని పిటిషనర్ తరపు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. సుప్రీం తీర్పు వివరాలను సమర్పించాలన్న హైకోర్టు.. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.