చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న (Teenmaar Mallanna)కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా.. చంచల్ గూడా జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. హైదరాబాద్ చిలకలగూడ సహా రాష్ట్రంలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో నమోదైన కేసుల్లో తీన్మార్ మల్లన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు రెండు నెలలకుపైనే తీన్మార్ మల్లన్న (Teenmaar Mallanna) జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై నేడు ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. అనంతరం బెయిల్ మంజూరు చేసింది.
ఈ కేసులో తీన్మార్ మల్లన్న (Teenmaar Mallanna) తరఫున సీనియర్ న్యాయవాది, భాజపా మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు హైకోర్టులో వాదించారు. పోలీసులు తప్పుడు కేసులతో వేధిస్తున్నారన్నారు. ఇరుపక్షాల వాదనల అనంతరం బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు.. పదిహేను వేల రూపాయల చొప్పున ఇద్దరి పూచీకత్తులను రంగారెడ్డి జిల్లా కోర్టులో సమర్పించాలని ఆదేశించింది. ఇప్పటి వరకు అరెస్టయిన కేసులన్నింటిలో బెయిల్ మంజూరు కావడంతో... చంచల్ గూడ జైలు నుంచి మల్లన్న విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు రాగానే మల్లన్నకు అనుచరులు, అభిమానులు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ కుట్రపూరితంగా తనపై కేసులు బనాయించి.. జైల్లో ఉంచారని మల్లన్న ఆరోపించారు. కేసులకు తాను బయపడేదిలేదన్నారు.
ఇదీ చూడండి: Theenmar mallanna family: అమిత్‌షాను కలిసి తీన్మార్ మల్లన్న సతీమణి.. పక్కనే అర్వింద్...
Mp Arvind meet teenmar mallanna: 'మల్లన్న జైలు నుంచి రాగానే భాజపాలోకి చేర్చుకుంటాం'