GOVT Focus on Yasangi Paddy Procurement : రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో రైతుల ఇబ్బందులను తీర్చడంపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో తూకం వేసిన ధాన్యం రైస్ మిల్లులకు వచ్చిన తర్వాత తాలు పేరిట తరుగు తీయకూడదని హెచ్చరించింది. తేమ, తాలు, తరుగు పేరుతో రైతులను ఇబ్బందులుకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రకటించారు.
పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశాలు మేరకు తాలు, తరుగుపై రైతుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపి వాస్తవ పరిస్థితులను నివేదించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యం దిగుమతికి రైస్ మిల్లర్లు ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా తక్షణం దించుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం తేమ శాతం 17 లోపు ఉండే విధంగా ఆరబెట్టి తాలు లేకుండా తీసుకువచ్చేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు.
ఫిర్యాదులు కోసం టోల్‌ఫ్రీ నెంబర్లు: ఏ దశలోనూ లారీలు హామాలీల కొరత లేకుండా కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగేలా వ్యవసాయ, రెవెన్యూ, రవాణా, సహకార విభాగాలతో క్షేత్ర స్థాయిలో పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకోవాలని సూచించారు. తాలు తరుగు పేరుతో మిల్లర్లు నుంచి ఎదురవుతున్న సమస్యలతోపాటు ధాన్యం కొనుగోలు, రవాణా, కనీస మద్ధతు ధర తదితర ఫిర్యాదుల కోసం ప్రతి జిల్లా కేంద్రంలో టోల్‌ఫ్రీ నంబర్‌ను పౌరసరఫరాల శాఖ ఏర్పాటు చేసింది. హైదరాబాద్ ఎర్రమంజిల్ ఫౌరసరఫరాల భవన్‌లో 1967, 180042500333 టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులో పెట్టింది.
Paddy buying centres : మంత్రి కమలాకర్ ఆదేశాల ప్రకారం ధాన్యం అమ్ముకునేందుకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని పౌరసరఫరాలశాఖ స్పష్టం చేసింది. గత ఏడాది ఇదే సమయానికి 16.66 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే ఈ ఏడాది ఇప్పటి వరకు 25.35 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. 8.69 లక్షల మెట్రిక్ టన్నుల అధికంగా కొనుగోలు చేశామని, తడిసిన ధాన్యం కొనుగోలు చేసి 3.34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం బాయిల్డ్ మిల్లులకు కేటాయించినట్లు పౌరసరఫరాల శాఖ తెలిపింది.
ఇవీ చదవండి: