కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం కాలపరిమితిని ఇటీవల మరో ఏడాది పాటు పొడిగించింది. ఈ కారణంగా వచ్చే ఐదేళ్లకు రాష్ట్రాల నిధుల అంశాలపై కేంద్రానికి నివేదిక ఇచ్చేందుకు ఆయా రాష్ట్రాలతో 15వ ఆర్థిక సంఘం సభ్యులు సమావేశమవుతున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు, ఆర్థిక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు దిల్లీలో 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్ నందకిశోర్ సింగ్ సహా సభ్యులను మంగళవారం కలిశారు. రాష్ట్రంలో చేపట్టిన వివిధ పథకాలను ఛైర్మన్‌కు మంత్రి వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన లేఖను అందజేశారు.
రాష్ట్రం చేపట్టిన ప్రాజెక్టులపై వివరణ
కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే నిధుల శాతం పెంచాలని.. రుణపరిమితి పెంచి రాష్ట్రాల ఆర్థిక స్థితికి కేంద్రం ఊతమిచ్చేలా చూడాలని కోరారు. తెలంగాణలో పలు ప్రాజెక్టులను ఆర్థిక సంఘం ఛైర్మన్ ప్రశంసించారన్న హారీశ్‌రావు... మిషన్ భగీరథ, కాళేశ్వరం అద్భుత పథకాలని కొనియాడినట్లు వివరించారు. ప్రత్యేక భౌగోళిక స్వరూపం కలిగిన రాష్టంలో నీటిని 83 మీటర్ల ఎత్తు నుంచి 618 మీటర్ల ఎత్తు వరకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. ప్రాజెక్టుల నిర్వహణకు వచ్చే ఐదేళ్లకు రూ.42 వేల కోట్లు ఖర్చవుతుందని వివరించామన్నారు. నిర్వహణ ఖర్చును కేంద్రమే భరించేలా సూచించాలని కోరినట్లు తెలిపారు.
ఇంటింటికి తాగునీరు అందించాలనే సంకల్పంతో కేంద్రం ప్రభుత్వం కంటే ముందే మిషన్ భగీరథ పథకాన్ని తీసుకొచ్చామని.. 'హర్ ఘర్ జల్' పథకం కింద భగీరథ నిర్వహణకు రూ.12 వేల కోట్లు గ్రాంట్ రూపంలో ఇచ్చేలా చూడాలని కోరినట్లు తెలిపారు.
ప్రాంతీయ సదస్సులు భాగ్యనగరంలో నిర్వహించే యోజన
ఏడాది పాటు కాలపరిమితి పెరగడం వల్ల రాష్ట్రాల ఆర్థిక పరిస్థితుల అధ్యయనానికి ప్రాంతీయ సదస్సులు ఏర్పాటు చేయాలని 15వ ఆర్థిక సంఘం భావిస్తోంది. దక్షిణ ప్రాంతాల కోసం హైదరాబాద్‌లో సదస్సు నిర్వహించే యోచనలో ఉన్నట్లు ఆర్థిక సంఘం ఛైర్మన్.. హరీశ్‌రావుకు తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించే సదస్సుకు వచ్చినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శస్తామని చెప్పినట్లు మంత్రి తెలిపారు.
ఇదీ చూడండి: 'మున్సిపల్ ఎన్నికల్లో తెరాస ఆలోచనను ఈసీ అమలు చేసింది'