ఈనెల మూడో వారం నుంచి రాష్ట్రంలో పోడు భూములకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ వెల్లడించారు. పోడు భూముల సమస్యకు పరిష్కారం కోసం సీఎస్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం (cs review on Podu Lands)జరిగింది. ఈ భేటీకి అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పీసీసీఎఫ్ శోభ, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ కమిషనర్ శేషాద్రి, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిష్టినా, తెలంగాణ టెక్నలాజికల్ సర్వీసెస్ ఎండీ వెంకటేశ్వరరావు హాజరయ్యారు.

దరఖాస్తు ఏ విధంగా ఉండాలి.. అందులో పొందుపరిచే అంశాలు, అటవీ సరిహద్దుల కో ఆర్డినెట్స్ నిర్ణయం, వివిధ స్థాయిల్లో కమిటీల ఏర్పాటు, అటవీ పరిరక్షణకు పౌరుల భాగస్వామ్యం తదితర అంశాలను ఈ సమావేశంలో చర్చించారు. ఈ అంశాలపై జిల్లా కలెక్టర్లు, అటవీ శాఖ కన్సర్వేటర్లు, డీఎఫ్ఓలతో సమావేశం (podu lands issue)నిర్వహించాలని నిర్ణయించారు.
ఇటీవల నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం ఏం చెప్పారంటే..
పోడు భూములకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ వెల్లడించారు. అందుకు అనుగుణంగా అక్టోబర్ 9న రాష్ట్రంలోని పోడు భూముల సమస్యలపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష (CM KCR Review on Podu Lands) నిర్వహించారు. పోడు భూముల పరిష్కారానికి కార్యాచరణ చేపట్టాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. దసరా తర్వాత కార్యాచరణ ప్రారంభించాలని సూచించారు. పోడు సాగుదారుల లెక్క తేల్చి సమస్య పరిష్కరించాలన్నారు.
గజం భూమి కూడా అన్యాక్రాంతం కావొద్దు..
అడవుల నడిమధ్యలో పోడు సాగు ఉండొద్దని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నడి అడవిలోని పోడు సాగును మరో చోటకు తరలించాలన్న ముఖ్యమంత్రి.. అలాంటి సాగుదారులకు అడవి అంచున భూమి కేటాయిస్తామన్నారు. పోడు భూమి తరలించి ఇచ్చిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వాలన్నారు. సాగుకు నీటి సౌకర్యంతో పాటు విద్యుత్ వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. పోడు రైతులకు రైతుబంధు, రైతుబీమా కూడా ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. పోడు భూముల వ్యవహారం లెక్క తేలిన తర్వాత ఒక్క గజం అటవీభూమి కూడా అన్యాక్రాంతం కావొద్దని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
అటవీ పరిరక్షణ కమిటీలను నియమించాలి..
దురాక్రమణలు అడ్డుకోవడానికి రక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు సూచించారు. అడవుల రక్షణ కోసం ఎలాంటి కఠిన చర్యలకూ వెనకాడవద్దన్నారు. పోడు సమస్యపై అవసరమైతే అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. అటవీ పరిరక్షణ కమిటీలు నియమించి..విధివిధానాలను రూపొందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఇదీచూడండి: