Telangana Cabinet Meeting 2023 : రాష్ట్ర మంత్రివర్గం త్వరలో సమావేశం అయ్యే అవకాశం ఉంది. నెలాఖరులోపు కేబినెట్ భేటీ జరగవచ్చని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పలు కీలక నిర్ణయాలు ఈ సమావేశంలో తీసుకుంటారని సమాచారం. వచ్చే నెల పదో తేదీలోపు శాసనసభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాల కోసం మంత్రివర్గాన్ని సమావేశపరచనున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ అంశం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. వేతన సవరణ కోసం కమిషన్‌ను నియమించడంతో పాటు మధ్యంతర భృతి కూడా ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ప్రకటించారు.
TS Cabinet Meeting 2023 : కేబినెట్(Telangana Cabinet 2023)లో ఈ విషయమై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అవసరం అనుకుంటే అంతకు ముందే ఉద్యోగ సంఘాలతో సీఎం సమావేశమై చర్చించే అవకాశం కూడా ఉంది. అనాథ చిన్నారుల కోసం ప్రత్యేక విధానాన్ని కూడా ఆమోదించే అవకాశం ఉంది. ఇటీవల జిల్లాల పర్యటనల సందర్భంగా కేసీఆర్ పలు హామీలు ఇచ్చారు. వాటిలో కొన్నింటికి మంత్రివర్గం ఆమోదం అవసరం. మరికొన్ని నిర్ణయాల విషయంలో నేతల నుంచి విజ్ఞప్తులు ఉన్నాయి.
ఈ భేటీలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు(Palamuru Rangareddy Lift Irrigation) సంబంధిత అంశాలు సహా ఇతర అంశాలు కూడా చర్చకు తీసుకోవచ్చని సమాచారం. గవర్నర్ నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీల కోసం గత మంత్రివర్గ సమావేశంలో తీర్మానించి సిఫార్సు చేసిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను గవర్నర్ తిరస్కరించారు. వారికి అర్హత లేదని, కేవలం సమ్మరీ మాత్రమే ఇచ్చారని, సమగ్ర వివరాలు లేవని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో నామినేటెడ్ ఎమ్మెల్సీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
నేడో, రేపో స్పష్టత.. : మంత్రులు కేటీఆర్(Minister KTR), హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, పలువురు నేతలు, ఉన్నతాధికారులతో సోమవారం ముఖ్యమంత్రి ఈ విషయమై చర్చించారు. ఏవైనా బిల్లులను వెనక్కి పంపితే ఉభయసభల్లో మళ్లీ ఆమోదించి పంపే వెసులుబాటు ఉంటుందని, నామినేటెడ్ ఎమ్మెల్సీల వ్యవహారంలో నిర్దిష్ట విధానం అంటూ ఏదీ లేదని చెప్తున్నారు. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశం చర్చనీయాంశంగా మారింది. వారి పేర్లను మళ్లీ సిఫార్సు చేయాలని ఒకవేళ ప్రభుత్వం భావిస్తే... కేబినెట్‌లో ఆ అంశం కూడా చర్చకు రానుంది. మంత్రివర్గంలో మళ్లీ రెండు పేర్లను ఆమోదించి.. అన్ని వివరాలతో దస్త్రాన్ని మళ్లీ రాజ్‌భవన్‌కు పంపే విషయమై ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వీటితో పాటు ఇతర అంశాలు కూడా కేబినెట్ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. మంత్రివర్గ సమావేశానికి సంబంధించి నేడో, రేపో స్పష్టత రానుంది.
Telangana Govt Vs Governor 2023 : రాజ్‌భవన్-ప్రగతిభవన్ మధ్య ఎంతెంత దూరం..? ఎన్నిసార్లు దూరం..?