తొలిసారి హైదరాబాద్ పర్యటనకు వచ్చిన భాజపా భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుగ్... పార్టీ నేతలు, కార్యకర్తలకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన ఆయన మొదటి రోజే పార్టీ అనుబంధ సంఘాలతో సమావేశాలు నిర్వహించారు. రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన వెంటనే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసిన 149 మంది అభ్యర్థులతో సమావేశమయ్యారు. కార్పొరేటర్లుగా విజయం సాధించిన వాళ్లు ఓటు వేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిజాయతీతో పనిచేయాలని సూచించారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఏ సమస్య వచ్చినా భాజపా గడపతొక్కేలా డివిజన్‌లలో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించినట్లు కార్పొరేటర్లు తెలిపారు.
ఓడిపోయిన అభ్యర్థులు నిరాశ చెందకుండా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. అనంతరం జీహెచ్‌ఎంసీ పరిధిలోని జిల్లా అధ్యక్షులు, ముఖ్యనేతలతో సమావేశమై గ్రేటర్‌లో విజయం, పార్టీ పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు.
చర్చకు సిద్ధమా అంటూ సవాల్
తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని.. ఆ కుటంబం మొత్తం సంపదను దోచుకుంటుందని తరుణ్ చుగ్ ఆరోపించారు. ఒక్క ఆస్పత్రిని సందర్శించకుండా... ఒక్క రిక్షావాలా కుటుంబాన్ని కూడా కలవకుండా ఫామ్ హౌస్లో కేసీఆర్ ఎంజాయ్ చేశారని విమర్శించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏం చేసిందో.. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. మేయర్ ఎన్నిక నిర్వహించకుండా తెరాస, మజ్లిస్ దాగుడు మూతలు ఆడుతన్నాయని విమర్శించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కేవలం ట్రైలర్ మాత్రమే చూపించామని అసలు సినిమా ముందు ఉందని హెచ్చరించారు.
యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తాం
భాజపా అనుబంధ సంఘమైన యువ మెర్ఛా జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో తరుణ్ చుగ్ సమావేశమయ్యారు. రాష్ట్రలో భాజపా గాలి వీస్తోందని.. పెద్ద ఎత్తున యువత పార్టీలోకి చేరేందుకు యువ మోర్ఛా శ్రేణులు కృషి చేయాలని సూచించారు. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకు జాతీయ నాయకత్వం సిద్ధంగా ఉందన్నారు. కష్టపడి పనిచేస్తే తగిన గుర్తింపు ఉంటుందని చెప్పినట్లు యువ మోర్చా వర్గాలు తెలిపాయి. కిసన్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ, మహిళా, యువ మోర్ఛా రాష్ట్ర అధ్యక్షులు, ఇన్ఛార్జ్తో సమావేశమయ్యారు.
శనివారం పార్టీ సీనియర్ నేతలతో భేటీ
శనివారం ఉదయం 10 గంటలకు పార్టీ సీనియర్ నేతలతో సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. సీనియర్ నేతల సమావేశం అనంతరం రాష్ట్ర పదాధికారులు, ప్రజాప్రతినిధులతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఇతర పార్టీల నుంచి చేరికలు, పార్టీ బలోపేతంపై సుదీర్ఘంగా చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఇన్ఛార్జ్లతో సమవేశమై పార్టీ పరిస్థితిని జిల్లాల వారిగా తెలుసుకోనున్నారు.
ఇదీ చదవండి: ఆదిలాబాద్ తాటిగూడ కాలనీలో కాల్పుల కలకలం