Telangana Assembly: కేంద్రప్రభుత్వ మార్గనిర్ధేశకాలకు అనుగుణంగా రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో... అప్పులు తీసుకునే శాతం పెంచేందుకు ఉద్దేశించిన ఎఫ్ఆర్ఎంబీ చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం సవరణ చేసింది. ఆబిల్లుపై శాసనసభలో వాడీవేడీ చర్చ జరిగింది. ప్రస్తుతం ఉన్న రుణపరిమితి శాతాన్ని నాలుగు నుంచి ఐదు శాతానికి పెంచారు. ప్రతి ఏడాది చట్ట సవరణ అవసరం లేకుండా ముందుగా ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అప్పులు పెంచుకునేందుకు ప్రభుత్వం ఈ బిల్లు తేవడం సబబు కాదన్న కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క పునరాలోచన చేయాలని కోరారు. భట్టి వ్యాఖ్యలతో విభేదించిన మంత్రి హరీశ్‌రావు అతితక్కువ అప్పులు తీసుకునే రాష్ట్రాల్లో... తెలంగాణ దేశంలోనే దిగువ నుంచి నాలుగో స్థానంలో ఉందని తెలిపారు. తెలంగాణ అప్పులు, జీఎస్డీపీ నిష్పత్తి కేవలం 27 శాతం మాత్రమేనన్న మంత్రి...అప్పు చేసి పప్పు కూడు తినడం లేదంటూ వ్యంగస్త్రాలు సంధించారు.
ఆమోదముద్ర...
వ్యవసాయ మార్కెట్ కమిటీల చట్టసవరణ బిల్లును... శాసనసభ ఆమోదించింది. మార్కెట్ కమిటీల్లో సభ్యుల సంఖ్యను 14 నుంచి 18కి పదవీకాలాన్ని గరిష్ఠంగా మూడేళ్లకు పెంచారు. ఎలాంటి చర్చ లేకుండానే సభ బిల్లుకు ఆమోదం తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి అదనపు వ్యయం అంచనాలకు శాసనసభ ఆమోదం తెలిపింది. 27వేల 734 కోట్ల అదనపు వ్యయానికి ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు సభలో ప్రతిపాదనలు పెట్టగా.. ఎలాంటి చర్చ లేకుండానే సభ ఆమోదముద్ర వేసింది.
ఇదీ చదవండి:మీరు చేసిన తప్పులను సరిదిద్దడం తప్పా?: మంత్రి హరీశ్‌రావు