6, 7, 8 తరగతులతో పాటు ప్రాథమిక పాఠశాలలను కూడా తెరవాలని అనేక ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. ప్రాథమిక పాఠశాలలను కూడా మార్చి 1 నుంచి ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని టీఎస్‌యూటీఎఫ్ కోరింది. కొవిడ్ నిబంధనలు పాటించాల్సి ఉన్నందున పారిశుద్ధ్య నిర్వహణకు స్వచ్ఛ కార్మికులను నియమించాలని సూచించింది. ప్రతి సెక్షన్‌కు 20 మంది విద్యార్థులు మించకుండా తరగతులు నిర్వహించాల్సి ఉన్నందున అదనంగా ఉపాధ్యాయులను నియమించాల్సి ఉందని, అందుకు పదోన్నతులు ఇవ్వాలని కోరింది. ఇంకా అవసరమైతే విద్యా వాలంటీర్లను నియమించాలని విన్నవించింది.
అన్ని ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించాలని ఎస్‌జీటీ ఫోరమ్ కోరింది. గదులు సరిపోని చోట షిఫ్టుల్లో లేదా రోజు విడిచి రోజు తరగతులు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం సూచించింది. పాఠశాలలకు, స్కూల్ కాంప్లెక్స్, ఎంఆర్‌సీలకు విడుదల చేయాల్సిన నిధులను వెంటనే ఇవ్వాలని కోరింది. టీపీటీఎఫ్, ఎస్‌జీటీయూ తెలంగాణ, ఆర్‌యూపీపీటీ తదితర సంఘాలు ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశాయి. తరగతులను ప్రారంభించాలని నిర్ణయం తీసుకోవడంపై ట్రస్మా ఒక ప్రకటనలో ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది.
సమయం ఇవ్వరా?
కొవిడ్ నిబంధనలు పాటించేందుకు తగిన సమయం ఇవ్వకుండా వెంటనే ప్రారంభించాలని నిర్ణయించడం ఏమిటని పీఆర్‌టీయూ తెలంగాణ ప్రశ్నించింది. ఒకవైపు కరోనా కేసులు పెరుగుతుంటే తరగతులను ప్రారంభించాలనడం తొందరపాటు నిర్ణయమని టీఎస్‌పీటీఏ ఒక ప్రకటనలో అభిప్రాయపడింది. ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల ఒత్తిళ్లకు తలొగ్గి అసంబద్ధ నిర్ణయం తీసుకుందని ఆరోపించింది.
విద్యా వాలంటీర్లు లేకుండా ఎలా?
గత కొన్నేళ్లుగా పనిచేస్తున్న విద్యా వాలంటీర్లు లేకుండా తరగతుల నిర్వహణ ఎలా సాధ్యమని, విద్యార్థులకు ఎలా న్యాయం జరుగుతుందని తెలంగాణ విద్యా వాలంటీర్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మఠం శివానందస్వామి ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ఒకవేళ ఎస్‌జీటీలను సర్దుబాటు చేసినా విద్యార్థులకు న్యాయం జరగదని తెలిపారు. విద్యా వాలంటీర్లను నియమిస్తూ వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
ఇదీ చదవండి: ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహాలపై నేతలతో కేటీఆర్ భేటీ