Lokesh on Panchayat Funds Transfer: గ్రామ పంచాయతీల నుంచి మళ్లించిన రూ.1,309 కోట్ల నిధులను తక్షణమే పంచాయతీ ఖాతాలలో జమచేయాలని ఏపీ సీఎం జగన్కు తెదేపా జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. మళ్లించడానికి వీలులేని ఆర్థిక సంఘం నిధులను వాడేశారంటే.. పూర్తిగా బరితెగించేశారని అర్థం అవుతోందన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అప్పులు తేవడం, ఆస్తులు అమ్మేయడం, కనిపించిన చోటల్లా తాకట్టు పెట్టడం.. ఈ మూడింటిపై ఆధారపడి పాలన సాగిస్తున్నారన్నారని విమర్శించారు. ఇప్పుడు నిధుల మళ్లింపు మీదపడ్డారన్నారని ఆక్షేపించారు. రాష్ట్రవ్యాప్తంగా 12,918 పంచాయతీల నుంచి రెండున్నరేళ్ల పాలనలో 1,309 కోట్లకు పైగా నిధులు మళ్లించడంతో కనీసం పంచాయతీ పారిశుద్ధ్య పనులకు రూపాయి లేని దుస్థితిలో ఉన్నాయన్నారు.
AP Panchayat Funds News: రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ మోసానికి గ్రామ పంచాయతీలు నిర్వీర్యమైపోయాయని లోకేశ్ అన్నారు. సర్పంచ్, వార్డు సభ్యులకు తెలియకుండా, పంచాయతీ బోర్డు తీర్మానం లేకుండా.. ఆయా పంచాయతీ ఖాతాల నుంచి నిధులు మళ్లించడం స్థానికసంస్థల ప్రతినిధులని ప్రభుత్వం మోసం చేయడం కిందకే వస్తుందన్నారు. గ్రామపంచాయతీల నుంచి మళ్లించిన నిధులను తక్షణమే పంచాయతీ ఖాతాలలో జమచేయాలని లోకేశ్ డిమాండ్ చేశారు. రాజకీయాధిపత్యం కోసం ప్రకటించిన ఏకగ్రీవాల పారితోషికం పంచాయతీలకు విడుదల చేయాలని లోకేశ్ లేఖలో పేర్కొన్నారు.
"కేంద్ర ప్రభుత్వం 14, 15వ ఆర్థిక సంఘాల ద్వారా కేటాయించిన నిధులని దారిదోపిడీదారుల్లా తరలించుకుపోవడం దారుణం. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ మోసానికి గ్రామ పంచాయతీలు నిర్వీర్యమైపోయాయి. నిధుల దారి మళ్లింపు రాజ్యాంగ విరుద్ధం. ఉచిత విద్యుత్ ప్రయోజనం అందుకుంటోన్న పంచాయతీల నుంచి ప్రభుత్వం పంచాయతీ కార్యవర్గాలకు తెలియకుండా రూ.344 కోట్లు విద్యుత్ పాత బకాయిల పేరుతో తీసుకోవడం సర్కారు గూండాగిరీ కిందకే వస్తుంది. గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్, మైనింగ్ సెస్, వృత్తి పన్ను, తలసరి గ్రాంట్, నీటి తీరువా పన్ను, ఇసుక, మైనింగ్ పై వచ్చే ఆదాయాలు వేల కోట్లు ఎగవేసి, ఇప్పుడు కేంద్రం ఇచ్చిన నిధులు కూడా వాడేయడం చాలా దుర్మార్గమైన చర్య. సీఎం జగన్ రాష్ట్రానికి ఎలా ముఖ్యమంత్రో, గ్రామానికి సర్పంచ్ కూడా అంతే. అటువంటి సర్పంచుల్ని ఆటబొమ్మల్ని చేసి, పంచాయతీల నిధులు దారి దోపిడీ దొంగలా ప్రభుత్వమే మాయం చేయడం అన్యాయం. పంచాయతీ వ్యవస్థని నిర్వీర్యం చేసే రాజ్యాంగేతర చర్యలు మానుకోవాలని. మళ్లించిన రూ.1309 కోట్ల నిధులను తక్షణమే పంచాయతీ ఖాతాలలో జమచేయాలి." అని లోకేశ్ లేఖలో పేర్కొన్నారు.
ఇదీ చూడండి: Central Team Met CM Jagan: సీఎం జగన్తో కేంద్ర బృందం.. వరద నష్టంపై చర్చ