లాక్‌డౌన్ సడలింపు సమయంలో ప్రజలు గుమిగూడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం లేఖ రాశారు. సడలింపు సమయంలో నిత్యావసర, మద్యం, జ్యూయలరీ, హోటల్స్, బట్టల దుకాణాల వద్ద జనం గుమిగూడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఇది కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌కు ఆటంకంగా మారుతుందని ఆరోపించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే లాక్‌డౌన్ లక్ష్యం నెరవేరదని తమ్మినేని అభిప్రాయపడ్డారు.
నిత్యావసర వస్తువుల దుకాణాలు తప్ప మిగతా వాటిని బంద్ చేయాలని తమ్మినేని విజ్ఞప్తి చేశారు. కూరగాయల మార్కెట్లను బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతి జిల్లాలో మండల స్థాయిలో ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని.. రెమ్డెసివిర్ కల్తీతో పాటు బ్లాక్ దందాను అరికట్టాలని తమ్మినేని డిమాండ్ చేశారు. ఆక్సిజన్ కొరత రాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు.
ఇదీ చదవండి: కారణం ఏదైనా అంబులెన్సులు ఆపే హక్కు ఎవరిచ్చారు: హైకోర్టు