Governor Tamilisai At Hyderabad Central University 23rd Convocation : ప్రతి ఒక్కరిలో అపారమైన నైపుణ్యాలు దాగి ఉంటాయని.. వాటిని గుర్తించగలిగితే అద్భుత విజయాలు సాధించవచ్చని గవర్నర్ తమిళిసై అన్నారు. మార్కుల కోసం కాకుండా జ్ఞానం కోసం చదవాలని.. మాతృభాషలో నేర్చుకుంటే విషయాన్ని త్వరగా అర్థం చేసుకోగలరని ఆమె సూచించారు. చీఫ్ రెక్టార్ హోదాలో హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ 23వ స్నాతకోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె నూతన విద్యా విధానం గురించి విశ్లేషించారు. ఆ విధానాన్ని అనుసరించి చదివితే జీవితంలో ఎలా ఎదుగుతామో తెలిపారు. ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా తన అనుభవం గురించి విద్యార్థులతో పంచుకున్నారు.
ఒకప్పుడు భారత్‌ను చాలా బీద దేశంగా చూసేవారని గవర్నర్ తెలిపారు. ఇప్పుడు భారత దేశాన్ని స్ట్రాంగ్‌గా చూస్తున్నారన్నారు. అలా చూసినప్పుడు చాలా గర్వంగా ఉంటుందని తెలిపారు. దేశంలోని యువత జీవితాలు మెరుగు పడటానికి ప్రధాని నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చారన్నారు.
"నాకు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నూతన విద్యావిధానం ప్రకారం మన దేశంలో ఉన్న వర్సిటీ అన్నింటికీ చాలా గుర్తింపు వస్తుంది. మన మాతృభాషలో చదువు నేర్చుకుంటే తొందరగా అర్థం అవుతుంది. చాలా మంది నోబెల్ గెలుచుకున్న వారు మాతృ భాషలో చదువు నేర్చుకున్న వారే. మన దేశంపై ఎప్పుడూ విరుచుకుపడే చైనా కూడా ఏషియన్ గేమ్స్‌లో గెలుచుకున్న పతకాల వల్ల మన జెండాను ఎగురవేశారు. ఇలాగే చదువుల్లో కూడా ప్రతిభ కనబరచాలి. చదువుకునేటప్పుడు సంతోషంగా చదువుకోవాలి. మార్కుల కోసం ఆలోచించకూడదు. ఎంత జ్ఞానాన్ని సాధించాం అనేది మనలో ఉండాలి." - తమిళిసై, గవర్నర్
UGC Chairman at Hyderabad Central University : ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో 65 శాతం మంది కనీస విద్య లేకుండా బతుకుతున్నారని, నేటి యువత తమ తెలివి తేటలను ఉపయోగించి రూరల్ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్ అన్నారు. చంద్రయాన్ -3 విజయంతో పాటు క్రీడల్లో పలు అవార్డులు రావడాన్ని నేటి తరం విద్యార్థులు చూడటం అదృష్టం అన్నారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతోందని క్యాంపస్ నుంచి వెళ్లిన వారంతా అందులో భాగస్వాములు కావాలని యూజీసీ ఛైర్మన్ కోరారు.
మహిళలపై వివక్ష తొలగించేందుకు విద్యార్థులు కృషి చేయాలని కోరారు. విశ్వమానవ సౌభ్రాతృత్వం కోసం పాటుపడాలని.. దేశంలోనే గొప్ప యూనివర్సిటీ నుంచి పట్టాలు పొంది బయటకెళుతున్నారని... దేశం గర్వపడేలా విద్యార్థులు అభివృద్ధి చెందాలని యూనివర్సిటీ ఛాన్సలర్ నరసింహ రెడ్డి కోరారు. విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులుకు గవర్నర్ మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఛాన్స్లర్ నరసింహ రెడ్డి, వైస్ ఛాన్సలర్ డీఎల్ రావ్‌తో పాటు యూనివర్సిటీకి చెందిన అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Pending Bills Issue in Telangana : మళ్లీ రాజ్‌భవన్ చేరిన బిల్లుల కథ.. ఈసారి గవర్నర్ నిర్ణయమేంటో..?