మూర్ఛ(ఎపిలెప్సీ/ఫిట్స్) వెయ్యి మందిలో నలుగురికి ఉంటుంది. ఇది ఏ వయసులోనైనా రావచ్చు. మెదడులోని ఏదైనా ఒక భాగంలో అవసరానికి మించి విద్యుత్తు ప్రవహించడం వల్ల ఫిట్స్ వస్తాయి. పిల్లల్లో గుర్తిస్తే వెంటనే చికిత్స చేసి తగ్గించే వీలుంది.
ఈ లక్షణాలు కూడా ఫిట్సే...
పిట్స్ వస్తే కిందపడి కాళ్లు, చేతులు కొట్టుకోవడం అనేది కొంతమందిలోనే జరుగుతుంది. కొందరు ఉన్నట్టుండి చేస్తున్న పని ఆపి 20-30 సెకన్లు బొమ్మలా మారిపోతారు. వీరిని పలకరించినా మాట్లాడరు. ఆ సమయంలో వీరు చేతులు నలపడం, మూతి చప్పరించడం చేస్తుంటారు. ఇలా చేస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. 4 నుంచి 10 ఏళ్ల వయసు పిల్లల్లో ఇది సాధారణం. తగిన చికిత్స అవసరమవుతుంది.
ఫిట్స్‌కు దోహదం చేసే కారణాలు...
తలకు గాయాలైతే: 5 శాతం
శిశువు పుట్టేప్పుడు బ్రెయిన్‌కు ఆక్సిజన్ అందక పోవడం వల్ల: 2-5 శాతం
కడుపులో నులి పురుగులు, ఏలికపాముల వల్ల: 2 శాతం
అతిగా మద్యపానం, ఒక్కసారిగా మద్యం మానేయడం వల్ల: 1-2 శాతం
జన్యుపరంగా: 20 శాతం
మెదడులో కణుతులు వల్ల: 30-40 శాతం
అందుబాటులో ఆధునిక చికిత్సలు
చాలా మందికి మందులతో మూర్ఛ తగ్గిపోతుంది. కొందరిలో శస్త్ర చికిత్సలతో నయం చేయవచ్చు. ఇంకొందరు ఎప్పుడూ మందులు వాడాలి. కొన్ని జాగ్రత్తలతో మూర్ఛ బారిన పడకుండా నియంత్రించవచ్చు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. పచ్చి కూరలు, సలాడ్లు తినేముందు శుభ్రంగా కడుక్కోవాలి. బాగా ఉడికించి తినడం మేలు.
- డాక్టర్ సీతాజయలక్ష్మి, సీనియర్ న్యూరాలజిస్ట్, మూర్ఛరోగ చికిత్స నిపుణులు
- ఇదీ చూడండి: మూర్ఛ వ్యాధికి మెరుగైన ఆయుర్వేద చికిత్సలు!