Steel Bridge RTC Cross Road : రాష్ట్ర రాజధానిలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంగా చేపట్టిన పై వంతెనల వల్ల వాహనదారులకు ఊరట కలుగుతోంది. ఈ క్రమంలోనే నగరంలో ప్రతిష్ఠాత్మకంగా ఉక్కు వంతెన నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం ఈ పనులు తుది దశకు చేరుకున్నాయి. రూ.350 కోట్ల వ్యయంతో నిర్మించిన ఉక్కు వంతెన ఆగస్టు మొదటి వారంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఆ రోజు నుంచే ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
Steel Bridge Opening in August : ట్రాఫిక్ పద్మవ్యూహంలా ఉండే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ త్వరలో సిగ్నల్ ఫ్రీ జంక్షన్‌గా మారబోతోంది. ప్రభుత్వం చేపట్టిన వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధిలో భాగంగా నిర్మిస్తున్న ఉక్కు వంతెన నిర్మాణం పూర్తి కావస్తోంది. వ్యాపార, వాణిజ్య పరంగా కీలకమైన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి లోయర్ ట్యాంక్‌బండ్ వరకు ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించనుంది. 2020లో స్టీల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ రామకృష్ణ మఠం, ఇంది రాపార్కు నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్, వీఎస్టీ మీదుగా నాగమయ్యకుంట వరకు దాదాపు మూడు కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్నారు. మూడేళ్లు సాగిన పనులతో వంతెన నిర్మాణం తుది దశకు చేరుకుంది.
"బ్రిడ్జ్ నిర్మాణం 6 నెలలు ఆలస్యం అయింది. ఈ ఆగస్టులో వంతెన అందుబాటులోకి వస్తుంది. దీంతో త్వరలో ట్రాఫిక్ సమస్యలు పూర్తిగా నయం అవుతాయి. అండర్ గ్రౌండ్‌లో కరెంటు వైర్లు, నీటి పైప్ లైన్లు అన్నింటినీ సరిచేస్తూ నిర్మాణాన్ని చేపట్టాం. హైదరాబాద్‌లో ఇలాంటి స్టీల్ బ్రిడ్డ్ ఎక్కడా లేదు."- ముఠా గోపాల్, ముషీరాబాద్ ఎమ్మెల్యే
Steel Bridge Hyderabad : 81 పిల్లర్లతో పాటు వంతెన కోసం 15 వేల మెట్రిక్ టన్నుల ఉక్కును వినియోగించారు. తాగునీరు, సివరేజ్ పైప్ లైన్లు, టెలిఫోను, విద్యుత్తు వైర్లను తొలగిస్తూ భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సంబంధిత అధికారుల సమన్వయంతో పనిచేశారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో మెట్రో కారిడార్‌పై మీదుగా అత్యంత ఇంజినీరింగ్ నైపుణ్యంతో వంతెనను దిగ్విజయంగా పూర్తిచేయడం మరో విశేషం. హైదరాబాద్‌కు మరో అదనపు ఐకాన్‌గా స్టీల్ వంతెన నిలవనుందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు.
"ఈ బ్రిడ్డ్ వల్ల ట్రాఫిక్ సమస్యలు తీరబోతున్నాయి. రాబోయే తరాల వారికి చాలా మేలు జరగబోతుంది. మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ మనకు ఎంతో మేలు చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఇందిరాపార్కుకి 5నిమిషాల్లో వెళ్లొచ్చు. అక్కడ నుంచి ఇతర ప్రదేశాలకు సులభంగా వెళ్లవచ్చు." - స్థానికుడు.
మరోవైపు... ఏళ్ల నుంచి ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యకు ఉక్కు వంతెనరూపంలో శాశ్వత పరిష్కారం లభించనుందని నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: