Statistical report on State Development: స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్-జీఎస్‌డీపీ) వృద్ధిరేటులో (స్థిర ధరల్లో) దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో ఉందని రాష్ట్ర అర్థ గణాంక శాఖ రూపొందించిన గణాంకాల నివేదిక స్పష్టం చేసింది. మిజోరం, గుజరాత్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయని పేర్కొంది. ప్రస్తుత ధరల్లో అయితే రాష్ట్రానికి నాలుగో స్థానమని.. సిక్కిం, మధ్యప్రదేశ్, త్రిపుర మొదటి మూడుస్థానాల్లో ఉన్నాయంది. జీఎస్‌డీపీ రూ.9,80,407 కోట్లని తెలిపింది. 2020-21లో దేశ జీడీపీ మైనస్ 3గా ఉండగా.. రాష్ట్ర జీఎస్‌డీపీ 2.4గా నమోదైందని పేర్కొంది. తలసరి ఆదాయ జాతీయ సగటు రూ.1,28,829 కాగా.. తెలంగాణది రూ.2,37,632గా ఉందని పేర్కొంది. ఈ నివేదికలో రాష్ట్ర పరిపాలన, భౌగోళిక స్వరూపం, జనాభా, మౌలిక సదుపాయాలు, ఆర్థిక వ్యవస్థ, పాఠశాల విద్య, వ్యవసాయం, సాగునీరు, రైతుబంధు, రైతుబీమా, ఆరోగ్యం, గ్రామీణ తాగునీరు, పల్లె, పట్టణప్రగతి, సామాజిక భద్రత అంశాలను విశ్లేషించారు.
భూపాలపల్లి జిల్లాలో అత్యధిక డ్రాపౌట్లు
- రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులు 60,06,344 మంది ఉండగా ఒక్కో పాఠశాలలో సరాసరి సంఖ్య 147. తక్కువ స్కూళ్లున్న జిల్లా జయశంకర్ భూపాలపల్లి కాగా.. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో ఉన్నాయి. ములుగు, ఆసిఫాబాద్ జిల్లాల్లో పాఠశాలకు 71 మంది విద్యార్థులుండగా.. హైదరాబాద్‌లో ఈ సంఖ్య 301. ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల నమోదు తక్కువగా ఉన్న జిల్లాలు పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, జనగాం, సూర్యాపేట.
- ప్రాథమిక పాఠశాలల్లో డ్రాపౌట్లు లేవు. ప్రాథమికోన్నత పాఠశాలలో 0.06 శాతం. 9,10 తరగతుల్లో ఇది 12.29 శాతం. భూపాలపల్లి జిల్లాలో అత్యధికంగా 29.40 శాతం మంది డ్రాపౌట్లున్నారు. తర్వాత స్థానాల్లో గద్వాల (25.69), సంగారెడ్డి (23.42), మహబూబాబాద్ (23.09).
- 2020-21లో ఐటీ ఎగుమతుల్లో వృద్ధిరేటు 13 శాతం...ఐటీ నిపుణులు, ఉద్యోగ నియామకాల్లో 8 శాతం.
- రాష్ట్రంలో మొత్తం వాహనాల సంఖ్య 1,38,11,466 కాగా.. 2019-20లో కొత్తవి 12,39,778 రిజిస్ట్రేషన్ కాగా 2020-21లో రిజిస్ట్రేషన్ల సంఖ్య 8,22,416. వాహనాల రిజిస్ట్రేషన్‌లలో మొదటి స్థానంలో హైదరాబాద్ జిల్లా ఉండగా తర్వాత స్థానాల్లో మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి ఉన్నాయి.
- 2011లో రాష్ట్ర జనాభా 3,50,02,674 మంది కాగా.. 2021లో ఆ సంఖ్య 3,77,25,000మంది.. 2031 నాటికి 3,92,07000 మంది ఉంటారని అంచనా.
- రాష్ట్రంలో మధ్యతరహా పౌష్టికాహార లోపం ఉన్న పిల్లలు 1,04,307మంది కాగా.. తీవ్ర లోపం ఉన్నవారు 54,160 మంది
- రాష్ట్రంలోని 24,028 గ్రామాలకు రక్షిత మంచినీరు అందించగా.. పల్లెప్రగతిలో 12,751 డంపింగ్ యార్డుల నిర్మాణం జరిగింది.
వరిసాగు, దిగుబడిలో నల్గొండ టాప్
- 2020-21లో 1,04,23,177 ఎకరాల్లో సాగు కాగా దిగుబడి 2,18,51,471 టన్నులు. రాష్ట్రంలో మొత్తం సాగుభూమి 147.56 లక్షల ఎకరాలు. రాష్ట్రంలో భారీనీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా ఇప్పటి వరకు కొత్తగా 21 లక్షల ఎకరాలకు, మధ్యతరహా ప్రాజెక్టుల ద్వారా 3 లక్షల ఎకరాలకు నీరందించారు.
- వరిసాగు విస్తీర్ణం, దిగుబడిలో నల్గొండ జిల్లా మొదటి స్థానంలో ఉంది. మక్కలులో వరంగల్ గ్రామీణ, కందిలో వికారాబాద్, వేరుసెనగ- నాగర్‌కర్నూల్, పత్తి-నల్గొండ, సోయాబీన్-కామారెడ్డి, టమాటా-రంగారెడ్డి, ఉల్లి- గద్వాల, జామ-రంగారెడ్డి, పసుపు-నిజామాబాద్, మామిడి- జగిత్యాల, బత్తాయి-నల్గొండ, పుచ్చసాగులో వరంగల్ గ్రామీణ జిల్లాలు మొదటి స్థానంలో ఉన్నాయి.
- రైతుబంధు లబ్ధిదారుల్లో బీసీ రైతులు 53 శాతం మంది, ఎస్సీలు 13, ఎస్టీలు 13, ఇతరులు 21 శాతం మంది ఉన్నారు.
- భూములు కలిగిన వారిలో బీసీలు 48 శాతం, ఎస్సీలు 9, ఎస్టీలు 13, ఇతరులు 30 శాతం మంది.
- రైతుబీమా కోసం 2018-19లో 30.72 లక్షల మంది రైతులు నమోదు చేసుకోగా క్లెయిమ్‌లు 17,979. 2020-21లో 31.25 లక్షల మంది రైతులు నమోదు కాగా క్లెయిమ్‌లు 28,287. 2020-21లో క్లెయిమ్‌లు పొందిన వారిలో బీసీలు 51 శాతం, ఎస్సీ 18, ఎస్టీ 15, మైనార్టీలు 1, ఇతరులు 15 శాతం మంది ఉన్నారు. బీమా పొందిన రైతులు అత్యధికం ఉన్న జిల్లా నల్గొండ, తర్వాత స్థానాల్లో సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, నిజామాబాద్ రంగారెడ్డి ఉన్నాయి.
- భూగర్భజల మట్టాలు అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో పెరగ్గా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1.8 మీటర్ల మేర తగ్గాయి.
- 2018-19 నుంచి 2020-21మధ్య రాష్ట్రంలో మత్స్య సంపద 19శాతం, పాల ఉత్పత్తిలో 6శాతం, మాంసం, చికెన్‌లో 22 శాతం, గుడ్లలో 16 శాతం పెరిగింది.
ఇదీ చదవండి: