తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ పూర్తిగా ఎత్తి వేయడంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కార్యకలాపాలు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. లాక్డౌన్ సడలింపు సమయాలు పెంచడం వల్ల ఈనెల ఒకటో తేదీ నుంచి ఆ శాఖ స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్లు ప్రక్రియను చేపట్టింది. ఈ నెల 12వ తేదీ నుంచి... ఉదయం నుంచి సాయంత్రం వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగింది. అయినప్పటికీ స్లాట్ బుకింగ్ ద్వారా కొవిడ్ నిబంధనలకు లోబడి రిజిస్ట్రేషన్లు చేయాల్సి రావడం వల్ల తక్కువ సంఖ్యలో రిజిస్ట్రేషన్లు అయ్యేవి. ఈనెల 20వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో లాక్డౌన్ తీసేయడంతో రిజిస్ట్రేషన్ల శాఖ స్లాట్ బుకింగ్తో నిమిత్తం లేకుండా రిజిస్ట్రేషన్లు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ శేషాద్రి సోమవారం అధికారులను ఆదేశించారు. నేటి నుంచే ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు.
గడిచిన మూడు రోజుల్లోనే అధికం..
ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు లక్షా 86 వేల 690 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా... జూన్ 21వ తేదీ వరకు 53 వేల 500 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయినట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నెల 21వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 1,126 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. జూన్ 1వ తేదీ నుంచి ఇప్పుటి వరకు రూ. 406 కోట్లు రాబడి వచ్చినట్లు ఈ శాఖ చెబుతోంది. గడిచిన మూడు రోజుల్లో జరిగిన రిజిస్ట్రేషన్లను పరిశీలిస్తే క్రమంగా రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది.
ఈ నెల 18వ తేదీన 3 వేల 885 డ్యాకుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా తద్వారా రూ. 21.91 కోట్లు రాబడి చేకూరింది. ఈనెల 19వ తేదీన 4 వేల 647 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యి తద్వారా రూ.27.72 కోట్లు ఆదాయం వచ్చింది. ఈనెల 21వ తేదీన 4,987 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యి రూ.31.61 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం చేకూరింది.
ఇదీ చదవండి: టీకాల పేరుతో నిర్మాత సురేశ్ బాబుకు టోకరా