ఏపీ ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణానికి చెందిన ప్రమీలా కుమారి... కనిగిరి మండలం చాకిరాలలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. పాడైన కోడి గుడ్డు పెంకులతో, చిన్న చిన్న రాళ్లు, మట్టితో రకరకాల బొమ్మలు, చిత్రాలను గీయటం ఆమె అభిరుచి. వాటికి తగిన రంగులను అద్ది జీవకళను ఉట్టిపడేలా తీర్చిదిద్దుతూ ఉంటారు.
స్వతహాగా బొమ్మలు గీసే అలవాటున్న ఆమె కరోనా సమయంలో వృథాగా పడేసిన వాటిని ఏదో విధంగా ఉపయోగంలోకి తీసుకురావాలని సంకల్పించారు. కోడి గుడ్డుపై అనేక రకాల చిత్రాలను గీసి వాటికి రంగులు వేసి పలువురి చేత ప్రశంసలు అందుకున్నారు. అంతే కాక రాళ్లపై రకరకాల చిత్రాలు, తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా మట్టి బొమ్మలను తయారు చేసి భళా అనిపించుకుంటున్నారు. తాను విధులు నిర్వహిస్తున్న పాఠశాలలో విద్యార్థులకు ఇటువంటి చిత్ర కళను నేర్పిస్తున్నట్లు ప్రమీలా కుమారి తెలిపారు.