లోపాల్ని సరిదిద్ది.. మనలోని శక్తి సామర్ధ్యాల్ని తెలియజేసేవే...పుస్తకాలు. సామాన్యుల్ని మహానీయులుగా మలిచిన చరిత్ర రచనల సొంతం. జీవితాలపై చెరగని ముద్ర వేసే సాహిత్యం అందించిన కవులంతా...ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పుస్తక పాఠకుల తగ్గిపోతున్న ప్రస్తుత తరుణంలో.. వినూత్న రచనలు, కవితలతో సాహితీ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.. శరణ్య మణివన్నన్.
యువత మెచ్చే రచనలు
సామాజిక మాధ్యమాల హవా కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో రచనలతో పాఠకుల్ని ఆకట్టుకోవటం, అలరించటం కత్తిమీద సాము లాంటిదే. వైవిధ్యమైన కవితలు, వినూత్న రచనలతో ఈ సవాల్‌ను సునాయాసంగా అధిగమిస్తోంది...యువ రచయిత్రి శరణ్య మణివన్నన్. చిన్నపిల్లల పుస్తకాలు దగ్గర నుంచి యువత మెచ్చే రచనలు చేస్తూ రచయితగా, కవయిత్రిగా రాణిస్తోంది.
5 పుస్తకాల రచన
భారత్‌లో పుట్టి...శ్రీలంకలో పెరిగి...మలేసియాలో చదువుకున్న శరణ్య మణివన్నన్‌కు 2008లో రాసిన తొలి పుస్తకం విచ్ క్రాఫ్ట్ రచయితగా మంచి గుర్తింపు తెచ్చింది. నచ్చిన రచనా రంగంలో రాణించగలననే ధైర్యం అందించింది. చెన్నైలో నివసిస్తున్నశరణ్య...ద న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దిన పత్రికలో వ్యాసాలు రాస్తోంది. రచయితగా ఇప్పటి వరకు 5 పుస్తకాల్ని పాఠకులకు అందించింది.
ది క్వీన్ ఆఫ్ జాస్మిన్ కంట్రీ
శరణ్య రాసిన తొలి నవల "ది క్వీన్ ఆఫ్ జాస్మిన్ కంట్రీ " పుస్తకాన్ని హర్పర్ కాలిన్స్ ఇండియా ప్రచురణ సంస్థ మార్కెట్లోకి విడుదల చేసింది. 7 వ శతాబ్దపు తమిళ సంస్కృతిని ప్రతిబింబిస్తూ.. రాసిన ఈ నవలకు చక్కని స్పందన వస్తోంది. ఆండాళ్ అనే యువతి జీవితాన్ని ఆవిష్కరించిన ఆమె...చక్కని రచనాశైలితో ప్రముఖుల నుంచి ప్రశంసలందుకుంది.
రచయితగా వైవిధ్యం
ప్రతిష్ఠాత్మక లావణ్య శంకరన్ ఫెలోషిప్ గ్రహీతైన శరణ్య...చిన్నారుల కోసం ద అమూచి- పూచి అనే చిత్ర కథ రాసింది. 2016లో విడుదలైన ఈ పుస్తకం విశేష పాఠకాదరణ దక్కించుకుంది. అదే సంవత్సరం చిన్న కథల సమాహారంగా "హై ప్రీస్టెస్ నెవర్స్ మ్యారిస్" అనే పుస్తకాన్ని మలిచింది. రచయితగా వైవిధ్యం చూపటంలో విజయం సాధించింది.
తొలి పుస్తకం విచ్ క్రాఫ్ట్ ద్వారా కవిత్వంపై తనకున్న పట్టు చాటుకున్న శరణ్య...ది అల్టార్ ఆఫ్ ది ఓన్లీ వరల్డ్ ద్వారా మరోసారి కవయిత్రిగా ప్రత్యేకత చాటుకుంది. అంతర్జాతీయ వేదికలపై తన కవితల్ని పాఠకులకు వినిపించింది. అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రదర్శనలిచ్చింది. కవిత్వంలోని మాధుర్యాన్ని నేటి తరానికి చేరువ చేసింది. రచనలు, కవితలతో సాహిత్యరంగానికి సేవలందిస్తున్న శరణ్య.... యువ రచయిత్రిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.
ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 384 కరోనా కేసులు, 3 మరణాలు