దక్షిణ మధ్య రైల్వే శ్రామిక్ స్పెషల్ రైళ్ల ద్వారా లక్షకుపైగా ప్రయాణికులను తమ సొంతూళ్లకు చేరవేసింది. మే 1 నుంచి మే 17 వరకు 93 శ్రామిక్ ప్రత్యేక రైళ్లను నడిపింది. ఆ రైళ్ల ద్వారా 1,18,229 ప్రయాణికులను వారి సొంత పట్టణాలకు తీసుకెళ్లింది. రెండు రాష్ట్రాల సహాయ సహకారాలతోనే రైళ్లను నడిపించినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. వలస కార్మికులను పంపే రాష్ట్రం, వారు వెళ్లే రాష్ట్రాల పరస్పర అంగీకారంతోనే ఇది సాధ్యమైందన్నారు.
రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు...
వలస కూలీలు, యాత్రికులు, పర్యాటకులు, విద్యార్థుల కోసం శ్రామిక్ స్పెషల్ రైళ్లను నడపాలని భారత రైల్వే నిర్ణయించింది. ఆ రైళ్లను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, ఝార్ఖండ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు నడిపారు. ప్రత్యేక రైళ్లలో ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్, కోచ్‌ను శుభ్రపరచడం వంటి అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. ప్రయాణంలో వారికి ఉచిత భోజనం, నీరు ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి : మల్కాపూర్ మహిళకు కరోనా పాజిటివ్