వేరే వాళ్లతో పరీక్ష రాయించి నకిలీ అర్హతతో కొందరు వైద్యులుగా మారిపోతున్నారు. పరీక్షా సెంటర్ల నిర్వాహకులు, కొందరు వైద్యులు ముఠాగా ఏర్పడి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ దందాపై రాచకొండ పోలీసులు కొరడా ఝుళిపించారు.
పరీక్ష కఠినమని అడ్డదారుల్లో...
మన దేశంలో ఎంబీబీఎస్ సీట్లకు గట్టిపోటీ ఉంటోంది. మంచి ర్యాంకు వస్తే కానీ సీటు దొరకడం కష్టం. కొంత మంది విదేశాలకు వెళ్లి ఎంబీబీఎస్ చదువుతున్నారు. తర్వాత వాళ్లు భారత్‌లో వైద్య వృత్తి కొనసాగించాలంటే ఇక్కడ నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్(ఎన్బీఈ) నిర్వహించే ఆన్లైన్ అర్హత పరీక్ష ఎఫ్ఎంజీఈ (ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్) పాసవ్వాలి. ఈ పరీక్ష చాలా కఠినంగా ఉంటుంది. భారీగా వెచ్చించి ప్రత్యేక శిక్షణ తీసుకున్నా.. గట్టెక్కలేక చాలా మంది పక్కదారి పడుతున్నారు.
పంపకాల్లో తేడా రావడంతో బయటకు
కర్ణాటకలోని బీదర్‌కు చెందిన సతీశ్ కుమార్ ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ చదివాడు. 2016 జులైలో భారత్‌కు వచ్చాడు. రెండు, మూడు సార్లు ఎఫ్ఎంజీఈ పరీక్షకు హాజరైనా పాసవ్వలేదు. మియాపూర్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ వైద్యుడిగా పని చేస్తున్న కోట గంగాధర్ రెడ్డి ముఠాను ఆశ్రయించాడు. రూ.3 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. రూ.లక్ష అడ్వాన్స్ ఇచ్చాడు. అతనికి బదులుగా కర్మన్‌ఘాట్ సెంటర్లో పరీక్ష రాసేందుకు ఝార్ఘండ్కు చెందిన సంతోష్ సింగ్(40) అనే వైద్యుణ్ని నగరానికి రప్పించారు. సెంటర్ నిర్వాహకుల మధ్య పంపకాల్లో తేడా రావడం వల్ల ఈ విషయం బయటకు పొక్కి, రాచకొండ పోలీసులకు చేరింది.
గతేడాది జూన్‌లో సరూర్‌నగర్ పోలీసులు సతీశ్ కుమార్, గంగాధర్‌రెడ్డి, సంతోష్ సింగ్‌లపై కేసు నమోదు చేసి కోర్టులో ఛార్జిషీట్ సమర్పించారు. ఈ ఛార్జిషీట్ సేకరించిన ఈనాడు-ఈటీవీ భారత్ అందులో వివరాల ఆధారంగా వాస్తవ పరిస్థితిపై ఆరా తీసింది.
ఇతర రాష్ట్రాల నుంచి వైద్యులను
మన రాష్ట్రానికి చెందిన వారే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన చాలా మంది విద్యార్థులు ఈ ముఠాల సాయంతో అర్హత పరీక్షలో గట్టెక్కినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముఠా సభ్యులు విద్యార్థులతో రూ.3 లక్షల నుంచి రూ.5లక్షల వరకు ఒప్పందం చేసుకుంటున్నారు.
పరీక్ష రోజున ఇతర రాష్ట్రాలకు చెందిన వైద్యులను నగరానికి రప్పిస్తున్నారు. పరీక్ష ప్రారంభానికి ముందు అసలు అభ్యర్థి వేలిముద్రలు, సంతకం తీసుకుంటున్నారు. తర్వాత కంప్యూటర్ దగ్గరికి మాత్రం వైద్యుణ్ని పంపిస్తున్నారు. సహకరించిన సెంటర్ నిర్వాహకులకు ఒక్కో అభ్యర్థి రూ.లక్ష వరకు చెల్లిస్తున్నారు.
పరీక్ష రాసిన వైద్యుడికి రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు ముట్టజెబుతున్నారు. సదరు వైద్యులు ఒకవేళ పట్టుబడినా నకిలీ గుర్తింపు కార్డులతో పోలీసులకే టోకరా వేస్తున్నారు. సంతోష్ సింగ్ చిరునామా కనుక్కోవడం పోలీసులకు కష్టతరంగా మారింది.
- ఇదీ చూడండి : క్షయను సమూలంగా నిర్మూలిద్దాం: గవర్నర్