హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో పలువురు చిన్న వ్యాపారుల్ని ‘ఈనాడు’ పలకరించగా వారంతా తమ కష్టాల్ని ఏకరువు పెట్టారు. ఎలక్ట్రికల్, మిఠాయి దుకాణాలు, గిఫ్ట్‌షాప్‌లు, క్షౌరశాలలపై లాక్‌డౌన్ ప్రభావం ఎక్కువగా ఉంది. లాభాలు దేవుడెరుగు..కనీసం ఖర్చులకు సరిపడా రాబడి రావడం లేదు. ఫలితంగా చాలామంది దుకాణాలు మూసేసేందుకు సిద్ధమవుతున్నారు. కొందరు ఇప్పటికే మూసేశారు. ‘అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. శానిటైజేషన్ చేస్తున్నా, జనాలు క్షౌరశాలకు రావడానికి భయపడుతున్నారు. ఎక్కువ మంది ఇళ్లలోనే క్షవరం చేసుకుంటున్నారు. గతంతో పోలిస్తే 40 శాతం కూడా ఆదాయం రావట్లేదు’ అని తట్టి అన్నారంలోని ఓ క్షౌరశాల యజమాని బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ‘వినియోగదారులు పెద్దగా రావడం లేదు. ఆదాయం లేదు. అద్దె భారంగా మారింది.
దుకాణం మూసేశా. తెలిసిన వాళ్లు, పాత వినియోగదారులు ఫోన్ చేస్తే వెళుతున్నా’ అని హయత్‌నగర్‌కు చెందిన ఎలక్ట్రీషియన్ చంద్రశేఖర్ చెప్పడం పరిస్థితికి అద్దం పడుతోంది.
లాక్‌డౌన్‌కు ముందు రోజూ సుమారు రూ.20 వేల వరకు వ్యాపారం జరిగేది. 12 మంది కుర్రాళ్లు పని చేసేవారు. రెండు నెలలు దుకాణం మూసేయడంతో పనివాళ్లంతా సొంత గ్రామాలకు వెళ్లిపోయారు. మళ్లీ వాళ్లను రప్పించాలంటే బయానాలు ఇవ్వాలి. దానికి బోలెడంత ఖర్చువుతుంది. దుకాణం నిర్వాహణకు, ఇతర సరకుల పెట్టుబడి కోసం తెచ్చిన సొమ్మే సకాలంలో చెల్లించలేకపోతున్నాం. ప్రస్తుతం వ్యాపారం కూడా సరిగ్గా సాగడం లేదు. దుకాణం నిర్వాహణ కష్టంగా ఉంది.
- కేటీ.చిత్రజన్, సాయి కేరళ బేకరీ, భూపాలపల్లి
దుకాణం పోయింది..తోపుడు బండి వచ్చింది
ఈయన పేరు మోహన్. ఖమ్మం పట్టణంలో భవాని మిఠాయి దుకాణం నిర్వహించేవాడు. లాక్‌డౌన్‌కు ముందు నిత్యం రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు విక్రయాలు జరిగేవి. అద్దె, ఖర్చులు పోను నెలకు కనీసం రూ.25 వేలు మిగిలేవి. లాక్‌డౌన్ సడలింపుతో దుకాణం తెరిచినా జనం కొనుగోళ్లకు ముందుకు రావట్లేదు. వ్యాపారం సాగట్లేదు. దుకాణం అద్దె కూడా కట్టలేని దుస్థితి. అందుకే దాన్ని మూసేశానని, కుటుంబ పోషణ కోసం తోపుడు బండిపై మిఠాయిలు, మిక్చర్ వంటి తినుబండారాలు అమ్ముకుంటున్నానని ఆయన వాపోయారు.
మార్చి, ఏప్రిల్ నెలల్లోనే రైతులు ఎక్కువగా మోటార్లు, ఇతర సామగ్రి కొనుగోలు చేస్తారు. ఈ రెండు నెలల్లో కనీసం రూ.10 లక్షల వ్యాపారం జరిగేది. ఈ సారి లాక్‌డౌన్‌తో ఆ వ్యాపారం ఆవిరైంది. అప్పు చేసి ఇల్లు, దుకాణం కిరాయి చెల్లించా. షాపులో పనిచేసే ఇద్దరు పనివాళ్లు మానేయడంతో కాలిపోయిన విద్యుత్తు మోటార్లనూ మరమ్మతు చేయలేకపోతున్నా.
-మాడేటి చంద్రయ్య, శివమారుతి ఇంజినీరింగ్ వర్క్స్, భూపాలపల్లి
షాపు తెరిచినా ఆదాయం లేదు
ఈయన పేరు మురారి. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఫ్యాన్లు, కూలర్ల మరమ్మతులు, మోటారు వైండింగ్ పనులు చేసే దుకాణ యజమాని. లాక్‌డౌన్ ముందు విశ్రాంతి లేకుండా పనులుండేవి. సీజన్ మొదలయ్యే తరుణంలో లాక్‌డౌన్ అమలు చేయడం ఆయన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇప్పుడు షాపు తెరిచాక వినియోగదారులు వస్తున్నప్పటికీ హైదరాబాద్‌లో అవసరమైన సామగ్రి దొరకకపోవడంతో చేతులెత్తేయాల్సి వస్తోందని, మూడు నెలల షాపు అద్దె బకాయి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండిః కరోనా ఉన్నా.. లక్షణాలు లేకుంటే ఇంటికే!