SIT Investigation in TSPSC Paper Leakage : టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో అరెస్టుల సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు.. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టకుండా సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి అరెస్టు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితుల సంఖ్య 37కు చేరగా... ఇది 50కి చేరవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
TSPSC Paper Leakage Issue Latest Update : ఈ ఏడాది మార్చి 7-8 తారీఖుల్లో టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం(టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్) లీకైనట్లు వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు లీకేజీతో ప్రమేయం ఉన్న 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి ద్వారా సమాచారంతో మరో ముగ్గురు పట్టుబడ్డారు. అదే నెల 13న బేగంబజార్ పోలీసులు కేసు నమోదు చేసి 12 మందిని అరెస్ట్ చేశారు. అనంతరం కేసు నగర సిట్‌కు బదిలీ చేశారు. నిందితులను విచారించినప్పుడు మరికొందరి వివరాలు వెలుగు చూశాయి. ప్రధాన నిందితులు ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డి చేతికి అందిన 7 ప్రశ్నపత్రాల్లో ఢాక్యానాయక్ దంపతులకు అసిస్టెంట్ ఇంజినీర్ ప్రశ్నపత్రం ఇచ్చారు. ఇద్దరితో పరీక్ష రాయించినట్టు కస్టడీలో చెప్పారు.
చేతులు మారిన ప్రశ్నపత్రాలు.. సవాల్‌గా మారిన గుర్తింపు : ఉపాధి హామీపథకంలో పనిచేస్తున్న ఢాక్యానాయక్ తిరుపతయ్య అనే దళారి ద్వారా సుమారు 10 మందికి ఏఈ ప్రశ్నపత్రం విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. ప్రవీణ్‌కుమార్ గ్రూప్1 ప్రిలిమినరీ, ఏఈ, ఏఈఈ, డీఏవో ప్రశ్నపత్రాలను పాతపరిచయాల ద్వారా గుట్టుగా విక్రయించాడు. సొమ్మును మరో బ్యాంకు ఖాతాలో జమచేసుకున్నాడు. ఇతడి వద్ద నుంచి ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసిన ఖమ్మం జిల్లాకు చెందిన సాయిలౌకిక్, హైదరాబాద్‌కు చెందిన మురళీధర్‌రెడ్డి మరికొందరికి విక్రయించి రూ.లక్షలు కొట్టేశారు. ప్రవీణ్, ఢాక్యానాయక్ నుంచి ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసిన అభ్యర్థులు మరికొందరికి అమ్మి ఖర్చు చేసిన సొమ్మును రాబట్టుకున్నారు. ప్రశ్నపత్రాలు చేతులు మారటంతో నిందితులను గుర్తించటం పోలీసులకు సవాల్‌గా మారింది.
అరెస్టుల సంఖ్య 50కి చేరవచ్చు : కమిషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని రోజుల తరబడి ప్రశ్నించి వాంగ్మూలం తీసుకున్నారు. చివరి ప్రయత్నంగా కష్టసాధ్యమైన పనికి సిద్ధమయ్యారు. గ్రూప్1, ఏఈ, ఏఈఈ, డీఏవో తదితర పరీక్షలు రాసిన అభ్యర్థుల జవాబుపత్రాలను పరిశీలించేందుకు సిద్ధమయ్యారు. ఒక్కో అభ్యర్థికి వచ్చిన మార్కులు ఆధారంగా జాబితా రూపొందించారు. వారిలో గరిష్ఠ మార్కులు తెచ్చుకొన్న అభ్యర్థులను వేరు చేశారు. వారి ఫోన్ నంబర్లను గుర్తించే పనిలో పడ్డారు. వారి బ్యాంకు ఖాతాలను పరిశీలించారు.
ఆ అభ్యర్థుల ప్రతిభ, సామర్థ్యాన్ని గుర్తించేందుకు సిట్ అధికారులు కొన్ని ప్రశ్నలు రూపొందించి సమాధానాలు రాబట్టారు. వాటిని అంచనా వేసి అసలు నిందితులను గుర్తించారు. 20 మంది నిందితులు ఉండొచ్చని తొలుత భావించారు. జవాబుపత్రాల పరిశీలనతో 37 మంది నిందితులుగా గుర్తించారు. ఈ సంఖ్య 50కు చేరవచ్చని అంచనా. రెండు మూడు రోజుల్లో మరో నలుగురిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. సుమారు రూ.50లక్షల సొమ్ము చేతులు మారి ఉండొచ్చని తెలుస్తోంది.
ఇవీ చదవండి :