Secunderabad protest : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో విధ్వంసానికి రైల్వే పోలీసుల ఉదాసీనత కూడా ఓ కారణమనే విమర్శలు తెరపైకి రావడంతో పోలీసు ఉన్నతాధికారులు ఓ రహస్య బృందాన్ని ఏర్పాటు చేసి పూర్వపరాలను తెలుసుకున్నట్లు సమాచారం. ఈ బృందంలోని సభ్యులు రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల పరిశీలించారు. ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడారు. సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి నిఘా వైఫల్యం, రైల్వే పోలీసుల నిర్లక్ష్యం ఉందని తేల్చారు.
అగ్నిపథ్ ప్రకటనను నిరసిస్తూ ఆర్మీ అభ్యర్థులు ఆందోళన చేసే అవకాశాలున్నాయన్న అంశాన్ని శాంతిభద్రతల పోలీసులు, రైల్వే పోలీసులు తేలిగ్గా తీసుకున్నారని రహస్య బృందం సభ్యులు ప్రాథమిక ఆధారాలు సేకరించారని తెలిసింది. వీటికి సంబంధించిన అంశాలతో ఒక నివేదికను తయారు చేస్తున్నట్టు సమాచారం. దీని ఆధారంగా బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోనున్నారు.
అగ్నిపథ్ ప్రకటనకు వ్యతిరేకంగా ఆర్మీ అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వేస్టేషన్లలోనూ నిరసన ప్రదర్శనలు చేసే అవకాశాలున్నాయని రైల్వేపోలీసులు భావించారు. స్టేషన్‌లోపల, వెలుపల నిరసనలు వ్యక్తం చేస్తే అప్పటి పరిస్థితి ఆధారంగా నిర్ణయం తీసుకుందామని అనుకున్నారు. ఈలోపు హైదరాబాద్ పోలీసులు కూడా విపక్షాలు, ఆర్మీ అభ్యర్థులు ఆందోళన చేస్తారన్న ముందస్తు అంచనాతో సమాచారం సేకరించారు.
చలో రాజ్‌భవన్ పేరుతో కాంగ్రెస్ జూన్ 16న కార్యక్రమం నిర్వహించినందున ఆ పార్టీ నాయకులు రాలేరని అనుకున్నారు. అదేరోజు రాత్రి కొందరు ఆర్మీ విద్యార్థులు స్టేషన్ వెలుపల ఆందోళన చేస్తారని.. ఓ నలభై, యాభైమంది వస్తారని రైల్వేపోలీసులకు సమాచారం అందింది. దీంతో ఇదేవిషయాన్ని వారు ఉత్తరమండలం పోలీసు అధికారులకు సమాచారమివ్వగా ఒక ఎస్సై, నలుగురు కానిస్టేబుళ్లు, ముగ్గురు హోంగార్డులు సరిపోతారంటూ చెప్పారు. జూన్ 17న ఉదయం 9గంటలకు వందలమంది ఆర్మీ అభ్యర్థులు రైల్వేస్టేషన్‌లోకి వెళ్లడంతో గోపాలపురం పోలీసులు, రైల్వే పోలీసులు చేతులెత్తేశారు. విధ్వంసం జరుగుతున్నా వారు అడ్డుకోలేకపోయారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద ఆందోళన నిర్వహించేందుకు ఆర్మీ అభ్యర్థులు వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు జూన్ 17 ఉదయం ఎనిమిదిగంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వచ్చారు. అప్పుడు ప్రయాణీకులు ఎక్కువగా ఉండడం, ఆర్మీ అభ్యర్థులు కనిపించకపోవడంతో ఇప్పుడిప్పుడేరారనుకొని .. పది లేదా పదిన్నరగంటలకు వద్దామనుకుని వారు తిరిగివెళ్లిపోయారు. ఉదయం 8 గంటల 30 నిమిషాలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఎదురుగా ఆల్ఫాహోటల్ వద్దకు వందలమంది ఆర్మీ అభ్యర్థులు చేరుకున్నారు.
ఆల్ఫాహోటల్ పరిసర ప్రాంతాల్లో గుంపులు,గుంపులుగా మాట్లాడుకుంటున్నారు. మరో రెండువందల మంది రైతీఫైల్ బస్టాప్‌వద్ద సమాలోచనలు చేస్తున్నారు. ఈ విషయాన్ని గోపాలపురం పోలీసులు గుర్తించలేదు. లోపలున్న రైల్వేపోలీసులు తెలుసుకోలేదు. ఆర్మీ విద్యార్థులు వచ్చినప్పుడు చూసుకుందాం అన్న ధోరణిలో ఉన్నారని రహస్య బృందం ఆధారాలు సేకరించారు. ఆల్ఫాహోటల్, పరిసర ప్రాంతాల్లో వందల మంది ఆర్మీ విద్యార్థులు మాట్లాడుకుంటున్న దృశ్యాలను సీసీ కెమెరాల ఫుటేజీలను రహస్య బృందం సభ్యులు తీసుకున్నారు. వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా త్వరలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.