Staff college diamond jubilee celebration: స్టేట్ బ్యాంకు అధికారులకే కాకుండా దేశ, విదేశాల్లోని ఇతర బ్యాంకర్లకు శిక్షణ ఇచ్చిన గొప్ప సంస్థ ఎస్‌బీఐ స్టాఫ్ కళాశాల అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ దినేశ్ కుమార్ ఖారా కొనియాడారు. బ్యాంకింగ్, ఆర్థిక రంగాల్లో అధికారులకు శిక్షణ ఇవ్వడంలో ఎస్‌బీఐ స్టాఫ్ కాలేజీ ఇతరులకు మార్గదర్శిగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఫ్యాకల్టీ పనితీరును సైతం ప్రశంసించారు. అధికారులకు శిక్షణ ఇవ్వడంలో చూపుతున్న చొరవను, అందించిన సేవలను ఆయన కొనియాడారు. 1961 డిసెంబరు 2న ఏర్పాటైన ఈ కళాశాల ఆరు దశాబ్దాలను పూర్తి చేసుకోవడంతో ఇవాళ డైమండ్ జూబ్లీ వేడుకలు జరిగాయి. ముఖ్యఅతిథిగా హాజరైన ఛైర్మన్ బేగంపేటలోని స్టేట్ బ్యాంకు స్టాఫ్ కాలేజీలో మొక్కలు నాటారు.
చదువుకున్న రోజులు గుర్తొచ్చాయి..
కళాశాలకు రావడంతో తిరిగి తాను చదువుకున్న రోజులు గుర్తు చేసుకున్నట్లు ఖారా తెలిపారు. స్టేట్ బ్యాంక్ స్టాఫ్ కాలేజ్ ఐఎస్ఓ 9000:2015 రేటింగ్ పొందడం... ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ద్వారా ప్లాటినం రేటింగ్‌ను పొందడం లాంటి వాటిని సైతం ఖారా గుర్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు.
రూ. 30లక్షలు విలువ చేసే బస్సు విరాళం..
ఎస్‌బీఐ సీఎస్‌ఆర్ కింద దాదాపు రూ. 30లక్షలు విలువ చేసే బస్సును లక్ష్యసాధన స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఛైర్మన్ ఖారా చేతుల మీదుగా అందజేశారు. ఈ వేడుకల్లో ఎస్‌బీఐ డిప్యూటీ మేనేజింగ్ డెరెక్టర్(హెచ్‌ఆర్) ఓంప్రకాశ్ మిశ్రా, డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్(ఆడిట్) ఆర్.విష్ణువర్దన్ రెడ్డి, చీఫ్ జనరల్ మేనేజర్ లక్ష్మి.ఆర్.శ్రీనివాస్, సర్కిల్ సీజీఎంలు రవికుమార్, వీఆర్ మజుందార్, ఏజీఎం జి.రామకృష్ణ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: SBI Chairman Appreciation: 'శెభాష్.. మరింత సమర్థవంతంగా పని చేయండి'