SANKRANTHI SAMBARALU: చలిని తరిమికొట్టే బోగి మంటలు, ఆ మంటల్లో చిన్నారులు ఆవు పేడతో చేసిన బోగి పిడతలను వేయడం, హరిదాసుల కీర్తనలు, డూడూ బసవన్నల దీవెనలు..! ఇంటి ముందు అందమైన రంగవల్లులు, గొబ్బెమ్మలు..! వేకువజామునే జంగమదేవరల జేగంటలు, ఢమరుక నాదాలు..! అక్కడక్కడా పిట్టలదొరల బడాయి మాటలతో.. పట్టణాలు, పల్లెలు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్లోని సంక్రాంతి సంబురాలు స్పెషల్..
తెలుగు వంటకాలు, పల్లె వాతావరణాన్ని: విజయనగరం జిల్లాలోని లెండీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు సంక్రాంతి విశిష్టత తెలిపేందుకు "సంక్రాంతి సంబురాలు" పేరిట వివిధ కార్యక్రమాలు నిర్వహించింది. నోరురూరించే తెలుగు వంటకాలు, పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా బొమ్మల కొలవులు ఏర్పాటు చేసి.. సంప్రదాయ వస్త్రధారణలో మెరిసిన విద్యార్థులు.. నృత్యాలు చేసి అలరించారు. పెద్ద పండగ విశేషాలను వివరించే విధంగా చాటి చెప్పారు.
విభిన్న ఆకృతులు, రంగుల్లో ముగ్గులు: విజయనగరం జిల్లాలోని ఆనంద గజపతిరాజు ఆడిటోరియంలో స్థానిక వాజీ ఛానల్ ఆధ్వర్యంలో మహిశామణులకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. జిల్లా చరిత్రను తెలియచేసేలా మహిళలు విభిన్న ఆకృతులు, రంగుల్లో ముగ్గులను తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో బుల్లితెర నటి జ్యోతిరాయ్, విజయనగరం మేయర్ విజయలక్ష్మీ పాల్గొన్నారు. మహిళలు ఎంతో ఉత్సాహంతో ఈ రంగవెళ్లి కార్యక్రమంలో పాల్గొన్నారు.
గోమాతకు పూజ: గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి. విద్యార్థులు గోమాతను పూజించి.. ఆటపాటలతో సందడి చేశారు. దీంతో విశ్వవిద్యాలయ ప్రాంగణం పండగ శోభను సంతరించుకుంది. విద్యార్థులు అంతా కలసి ఎంతో సందడిగా ఈ కార్యక్రమంలో గడిపి.. పాత రోజుల్లో ఈ విధంగా పూజించేవారు కదా అని మురిసిపోయారు.
క్రికెట్ టోర్నమెంట్: పల్నాడు జిల్లా పెదకూరపాడులోని శ్రీ చైతన్య స్కూల్లో జరిగిన సంక్రాంతి వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే నంబూరి శంకరరావు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని అయ్యప్ప స్వామి గుడి సమీపంలో పోలీసుల ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జగన్మోహన్ బ్యాటింగ్ చేసి యువతను ఉత్సాహపరిచారు. అనంతరం యువత ఉత్సాహంతో టోర్నమెంట్లో పాల్గొన్నారు.
గంగిరెద్దుల విన్యాసాలు: విశాఖపట్నంలోని పాండురంగ పురం బీచ్ రోడ్డులోని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు నివాసం వద్ద సంక్రాంతి సంబరాలు వైభవంగా జరిగాయి. గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. బీచ్ రోడ్డులోని పర్యాటకులు అంతా గంగిరెద్దుల విన్యాసాలను చూడడానికి వచ్చి.. ఎంతో ఆసక్తిగా తిలకించారు.
ఇవీ చదవండి