బతుకమ్మ, దసరా పండుగల ముందు ఆర్టీసీ చేపట్టనున్న సమ్మెపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వానికి ఐకాసకు మధ్య రెండు దశలుగా జరిగిన చర్చలు ఎటూ తేలకపోవటం వల్ల ప్రయాణికులు తీవ్ర ఆందోళనలో పడ్డారు. డిమాండ్ల పరిశీలనకు వ్యవధి కావాలని త్రిసభ్య కమిటీ... ఇటు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావటం లేదని ఆర్టీసీ ఐకాస.. ప్రజలను అయోమయంలో పడేస్తున్నాయి.
పట్టు వీడని కార్మిక సంఘాలు....
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశాన్ని సూత్రప్రాయంగా అంగీకరిస్తూ... విధివిధానాలపై కమిటీ వేయాలని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వ చర్యలు లేవన్నారు. ప్రభుత్వమే తమను సమ్మెలోకి నెట్టిందని ఐకాస నేతలు పేర్కొన్నారు. ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా వాటినే నష్టాలుగా చూపెడుతోందని కార్మికసంఘాలు ఆరోపించాయి. ఎస్మాకు భయపడే ప్రసక్తేలేదని ఐకాస తేల్చి చెప్పింది.
సమయం కావాలి
26 డిమాండ్లతో ఐకాస సమ్మె నోటీసు ఇచ్చిందని వాటిని అధ్యయనం చేసేందుకు సమయం పడుతుందని త్రిసభ్య కమిటీ పేర్కొంది. ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి కనీసం వారం రోజులు పడుతుందని తెలిపింది. ఒత్తిడిలో నివేదిక సక్రమంగా రాదని... అందుకే పండుగ ముగిసే వరకు సమ్మె విరమించాలని కార్మిక ఐకాసను కోరుతున్నట్లు పేర్కొన్నారు. సమ్మెకు వెళ్తే ప్రభుత్వం వద్ద ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని... ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
ఇవాళ మరోసారి జేఏసీ ప్రతినిధులతో త్రిసభ్య కమిటీ చర్చలు జరిపే అవకాశముంది. సమ్మె నోటీసుపై చర్చలు జరిపేందుకు కార్మికశాఖను కూడా ఆహ్వానించింది.
ఇదీ చూడండి: ఆ నగరంలో ట్రాఫిక్ జామ్ అయితే ఆనందమే!