టీఎస్ఆర్టీసీ జేఏసీ పిలుపుతో సికింద్రాబాద్ రాణిగంజ్ డిపో 1 ఎదుట ఆర్టీసీ కార్మికులు నల్ల రిబ్బన్ ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్న తిరుపతి రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అధికారులు ఇప్పటికైనా కార్మికులపై వేధింపులు మానుకోవాలని జేఏసీ ఛైర్మన్ రాజిరెడ్డి డిమాండ్ చేశారు. సూర్యాపేట, షాద్ నగర్, సిద్దిపేట డిపోల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టామని ఆర్టీసీ జేఏసీ వెల్లడించింది.
సికింద్రాబాద్ రాణిగంజ్ ఆర్టీసీ డిపో1లో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నారు. రాణిగంజ్‌లో విధులు నిర్వహిస్తున్న తిరుపతి రెడ్డికి అధికారులు కొన్ని రోజులుగా విధులు కేటాయించట్లేదు. ఈ విషయమై బాధితుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలోనే అధికారులు వేధిస్తున్నారంటూ... తిరుపతిరెడ్డి డిపోలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
వెంటనే అప్రమత్తమైన సహచరులు ఆస్పత్రికి తరలిస్తుండగానే దారిలో తిరుపతి రెడ్డి మృతి చెందారు. నెలరోజుల నుంచి అధికారులు డ్యూటీ ఇవ్వకుండా వేధిస్తున్నారని సహద్యోగులు ఆరోపించారు. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్ల ఆర్టీసీ డ్రైవర్లు ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు.
ఇదీ చదవండి: ఆర్టీసీ డిపోలో పురుగులమందు తాగి డ్రైవర్ ఆత్మహత్య