ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ చేసిన రాజీనామాను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఆయన దరఖాస్తును పరిగణనలోకి తీసుకుని... పదవీ విరమణకు అనుమతిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. మూడు నెలల ముందుగా నోటీస్ ఇవ్వాలన్న నిబంధనను ప్రభుత్వం మినహాయించింది. ప్రవీణ్ కుమార్‌ను ప్రభుత్వం విధుల నుంచి రిలీవ్ చేసింది. ఆయన స్థానంలో గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శిగా ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్ రోస్‌ను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
పేదలకు సేవచేసేందుకే..
పేద ప్రజలకు మరింత సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఐపీఎస్ పదవికి స్వచ్ఛంద విరమణ దరఖాస్తు చేసుకున్నట్లు గురుకులాల కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ తెలిపారు. సూర్యుడు పడమర నుంచి ఉదయిస్తాడనేది ఎంతో తప్పో.. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం అంతే తప్పని స్పష్టం చేశారు. భవిష్యత్తు తరాల అభివృద్ధే లక్ష్యంగా తన కార్యాచరణ ఉంటుందన్నారు.
ప్రవీణ్ కుమార్ జర్నీ..
మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్‌లో జన్మించిన ప్రవీణ్‌కుమార్ 25 సంవత్సరాల పాటు పోలీసుశాఖలో పనిచేశారు. ముఖ్యంగా వామపక్ష తీవ్రవాదం ఉద్ధృతంగా ఉన్న రోజుల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో విధులు నిర్వర్తించారు. కరీంనగర్‌లో ఉన్నప్పుడు ఒకేసారి 45 మంది జనశక్తి నక్సలైట్లు లొంగిపోయేలా చేశారు. దాంతో ఆ సంస్థ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు వామపక్ష తీవ్రవాదం వైపు మొగ్గు చూపకుండా ఉండేలా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం కొన్నాళ్లు అమెరికా వెళ్లారు. అక్కడి నుంచి రాగానే తానే ప్రభుత్వాన్ని అడిగి గురుకులాల బాధ్యత తీసుకున్నారు. చిన్నపుడు ఎస్సీ హాస్టల్లో ఉండి చదువుకున్న ఆయన... అవే పాఠశాలల సొసైటీకి తొమ్మిదేళ్లపాటు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించడం విశేషం.
ఇదీ చూడండి: RS PRAVEEN KUMAR: ఐపీఎస్కి ప్రవీణ్ కుమార్ రాజీనామా.. కారణమిదే!