Rs 4016 Asara Pension For Disabled : దివ్యాంగులకు ఆసరా పింఛను రూ.4016కు పెంచుతూ, విద్యార్థులకు డైట్ ఛార్జీలను పెంచుతూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ పెరిగిన పింఛను, డైట్ ఛార్జీలు జులై నెల నుంచి అమలు చేయనున్నారు. ఈ ఆసరా పింఛను వల్ల ఐదు లక్షల మంది దివ్యాంగులకు లబ్ధి చేకూరనుందని ప్రభుత్వం భావిస్తోంది. పలు అంశాలపై సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. దివ్యాంగులకు ఆసరా పింఛను వంటి వివిధ అంశాలపై మంత్రులు, అధికారులతో ఇంకా సీఎం సమీక్ష జరుపుతున్నారు.
దివ్యాంగులకు పింఛన్ పెంపు ఉత్తర్వులు ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా దివ్యాంగుల పింఛన్లు పెంపుపై సీఎంకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధిక పింఛన్లు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని వాపోయారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు కట్టుబడి ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు.
Asara Pension : దివ్యాంగులకు పింఛను రూపంలో నెలకు రూ.4016 చొప్పున రూ.250.48 కోట్లు పంపిణీ చేయనున్నామని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. దివ్యాంగులకు పింఛను ప్రకటించిన సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు.. దివ్యాంగులకు శుభాకాంక్షలు వెల్లడించారు. మొత్తం 5,11,656 మంది దివ్యాంగులకు పింఛన్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఈ పెరిగిన పింఛనుతో దివ్యాంగుల భద్రతతో కూడిన జీవనం అందనుందని హర్షం వ్యక్తం చేశారు.
గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలలో డైట్ చార్జీల పెంపు : అన్ని రకాల గురుకులాలు సహా పలు శాఖలకు అనుబంధంగా నడుస్తున్న హాస్టళ్లలో డైట్ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ప్రకారం డైట్ ఛార్జీలు పెంచిన.. సంబంధిత దస్త్రంపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. విద్యార్థులకు మరింత నాణ్యమైన భోజన వసతులను అందించేందుకు ప్రస్తుతం ఇస్తున్న డైట్ ఛార్జీలను పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ పెరిగిన ఛార్జీలు జులై నెల నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు.
పెరిగిన డైట్ ఛార్జీలు : 3 నుంచి 7వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు నెలకు రూ.950 నుంచి రూ.1200లుగా డైట్ ఛార్జీలుగా ప్రభుత్వం పెంచింది. 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నెలకు రూ.1400లుగా ప్రకటిస్తూ.. రూ.1100 నుంచి రూ.1400లకు ఛార్జీలను పెంచారు. ఇంటర్ నుంచి పీజీ వరకు చదివే విద్యార్థులకు రూ.1500 నుంచి డైట్ ఛార్జీలను రూ.1875కు రాష్ట్ర ప్రభుత్వం పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది.
ఇవీ చదవండి :