ప్రజలకు రేషన్ సరుకులు పంపిణీ జరుగుతున్న తీరుపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. సమావేశానికి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ కలెక్టర్లు టెలీకాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. కంటైన్మెంట్ జోన్లలో తీసుకుంటున్న చర్యలపై కూడా సమావేశంలో చర్చించారు. రేషన్ కార్డుదారులతో పాటు వలస కార్మికులకు కూడా బియ్యం, నగదు అందిస్తున్నామని మంత్రి తలసాని అన్నారు.
భౌతిక దూరం ఇంకా అవసరం...
హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాల్లోనూ అన్నపూర్ణ కేంద్రాల సంఖ్యను గణనీయంగా పెంచినట్లు వివరించారు. అన్నపూర్ణ కేంద్రాల వద్ద భౌతిక దూరాన్ని కొనసాగించాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశామన్నారు. ఎవరూ ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి, అధికారులు సమీక్షలో పాల్గొన్నారు.
ఇవీ చూడండి : దేశంలో లాక్డౌన్ 3.0 ఖాయమే.. అతి త్వరలోనే ప్రకటన