ఉద్యోగుల పట్ల ఈసీ తీరు ఆక్షేపణీయమని.. ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. రాజకీయాలతో తమకు సంబంధం తెలిపారు. వ్యాక్సిన్ వేసుకోకుండా మాస్కులు, శానిటైజర్ వాడితే కరోనా రాదా అని ప్రశ్నించారు. అన్నీ వాడినా, వైద్య సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలుసుకోవాలని బొప్పరాజు అన్నారు. ఎన్నికల కమిషనర్ చెప్పినట్లు నడుచుకోవటానికి తాము సిద్ధంగా లేమని ఆయన స్పష్టం చేశారు.
ఎన్నికల కోసం 10 లక్షల మంది ఉద్యోగులు విధులు నిర్వహించాల్సి ఉంటుందనీ... ఎన్నికల నిర్వహణ వలన ఒక్కరు కూడా మరణించరని హామీ ఇవ్వగలరా అని ఎస్ఈసీని బొప్పరాజు నిలదీశారు. కొవిడ్ నియంత్రణ పోరులో వందల మంది ప్రాణాలు కోల్పోయారనీ.. ఎన్నికలను వాయిదా వేయాలని అన్నారు. వ్యాక్సిన్ వేశాక ఉద్యోగులు మానసికంగా సిద్ధమవుతారని పేర్కొన్నారు. ఎన్నికలు నిర్వహించకపోతే రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుందా అని ప్రశ్నించారు. దీనిపై త్వరలోనే గవర్నర్ను కలిసి వినతి పత్రం అందజేస్తామని బొప్పరాజు తెలిపారు. ఉద్యోగులపై విమర్శలు చేస్తున్న వారితో బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు.
ఇదీ చదవండి: అవసరమైతే సాగు చట్టాల అమలుపై స్టే: సుప్రీంకోర్టు