రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి.. జైపాల్‌రెడ్డి ఆకాంక్షలను నిజం చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. జైపాల్‌రెడ్డి ద్వితీయ వర్ధంతిని పురస్కరించుకొని.. నెక్లెస్‌రోడ్‌లోని స్ఫూర్తి స్థల్‌లో నివాళులర్పించారు. సోనియాగాంధీని ఒప్పించి జైపాల్‌రెడ్డి రాష్ట్రాన్ని సాధించారని రేవంత్‌రెడ్డి ప్రశంసించారు. హైదరాబాద్‌కు మెట్రోరైల్ రావడంలో కీలక భూమిక పోషించారని గుర్తుచేశారు. ఎడారిగా మారిన పాలమూరు జిల్లాను పచ్చగా మార్చేందుకు.. కల్వకుర్తి ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టారని వివరించారు. కేంద్రమంత్రిగా వివిధ హోదాల్లో పనిచేసిన జైపాల్‌రెడ్డి అవినీతి మచ్చలేని నాయకుడని.. నేటితరం ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలని రేవంత్‌రెడ్డి సూచించారు. స్ఫూర్తి స్థల్‌లో మంత్రి నిరంజన్‌రెడ్డి నివాళులర్పించారు.
కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిగా, పట్టణాభివృద్ధి మంత్రిగా ఆయన దేశానికి చేసిన సేవలు మరువలేనివని రేవంత్ గుర్తు చేశారు. ఎన్నో కీలకమైన పదవులు నిర్వహించినా అవినీతి మరకలేని వ్యక్తి అన్నారు. జైపాల్ రెడ్డి ఆశయాలు, సిద్ధాంతాలు ఆచరించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆయనను గొప్ప వైతాళికుడిగా అభివర్ణించారు. తెలంగాణ కాంగ్రెస్ సైనికులుగా సోనియా గాంధీ నమ్మకాలను నిలబెట్టి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి సోనియమ్మ రాజ్యం ఏర్పాటు చేస్తామని తెలిపారు.
జైపాల్‌రెడ్డి సమాలోచనతోనే తెలంగాణ వచ్చింది. ఆయన నిర్ణయం వల్లే హైదరాబాద్ మెట్రో రైలు వచ్చింది. వినూత్న విధానాలు తీసుకొచ్చారు. తెలంగాణను జైపాల్‌రెడ్డి ఎలా అభివృద్ధి చేయాలనుకున్నారో... ఆయన ఆకాంక్షలను నిజం చేస్తాం. ప్రజల స్వేచ్ఛ, హక్కులకు భంగం కలగకుండా, అన్ని వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తాం. ఆయనను ఆదర్శంగా తీసుకొని పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం. జైపాల్‌రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని కాంగ్రెస్‌ను నడిపిస్తాం.
-రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
ఉత్తమ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి రెండో వర్ధంతి సందర్బంగా ఆయనకు ఘనంగా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన సేవలను స్మరించుకుంటూ ఒక ప్రకటన విడుదల చేశారు.
విలువలకు ప్రాధాన్యత ఇచ్చిన నేత కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి. విద్యార్థి దశ నుంచి చివర శ్వాస వరకు విలువలతో కూడిన రాజకీయాలు చేసిన మహామనిషి. గొప్ప వ్యక్తిత్వం కలిగిన నాయకుడు. నీతి, నిజాయితీతో ప్రాణమున్నంతవరకు నమ్మిన సిద్ధాంతం కోసం పోరాటం చేశారు. విలువలు, సిద్ధాంతాలు ఆచరించిన గొప్పనేత. ఎమ్మెల్యేగా, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులుగా... కేంద్ర మంత్రిగా సుదీర్ఘ కాలం ప్రజాసేవలో ఉన్న వ్యక్తి జైపాల్ రెడ్డి. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర మరువలేనిది.
-ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎంపీ
జైపాల్‌రెడ్డి సేవలను మాజీమంత్రి జానారెడ్డి స్మరించుకున్నారు. నెక్లెస్‌రోడ్‌లోని స్ఫూర్తి స్థల్‌లో టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్లు గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శి వంశీ చంద్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి వినోద్, సురేష్ షెట్కార్ తదితరులు నివాళులు అర్పించారు.
ఇదీ చదవండి: ACCIDENTS: ప్రమాదాల మార్గం.. అందుబాటులోని లేని అత్యవసర సేవలు