ఉద్యోగాలు, వ్యాపారాలు, పిల్లల పెంపకమంటూ కాలమంతా యాంత్రికంగా గడుస్తోంది. మానసిక ఒత్తిడితో పాటు మనం తీసుకునే ఆహారం వల్ల అనేక రోగాలు పుట్టుకొస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాయమం మన ఆరోగ్యానికి శ్రీరామరక్ష. కానీ నగర ప్రజలు వివిధ పనుల్లో మునిగి ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టడంలేదు.
వయసుతో సంబంధం లేకుండా...
ఇలాంటి పరిస్థితుల్లో వయసుతో సంబంధం లేకుండా 54ఏళ్ల ఓ వ్యక్తి కిలోమీటర్ల మేర నడుస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. ఆయనే హైదరాబాద్ తార్నాకకు చెందిన రవికుమార్. సీఆర్పీఎఫ్లో విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందారు. వృత్తిరీత్యా పంజాబ్, జమ్మూకశ్మీర్, కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్‌తో పాటు హైదరాబాద్ వంటి వివిధ ప్రాంతాల్లో పనిచేశారు. ఆయా ప్రాంతాల్లో దొరికే ఆహారాన్ని తీసుకోవడం వల్ల బరువు పెరిగారు. ఓ ప్రయాణంలో జరిగిన ఘటన... ఆయన్ని నడకలో రికార్డు సృష్టించేలా తయారుచేసింది.
రోజు 20వేల నుంచి 30వేలు...
నిత్యం నడవడం రవికుమార్‌కు అలవాటుగా మారింది. కాలంతో సంబంధం లేకుండా రోజు 20 నుంచి 30 వేల అడుగులు నడుస్తారు. నడకలో రికార్డులు సృష్టించాలని భావించిన రవికుమార్... సాధన మరింత కఠినం చేశారు. విరామం లేకుండా లక్ష అడుగులు నడవాలని నిర్ణయించుకున్నారు. అందుకు అనుగుణంగా ఆహార అలవాట్లు మార్చుకుని... నడక సాగించారు.
నడకలో రికార్డు...
చివరకు జనవరి 9న అర్ధరాత్రి 12 గంటల నుంచి మరుసటి రోజు 12 వరకు 24 గంటల్లో... 79.6 కిలోమీటర్లు... లక్ష 14 వేల 633 అడుగులు వేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. నడకలో రికార్డు సృష్టించిన రవికుమార్‌ను.... హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ సహా పలువురు ఉన్నతాధికారులు అభినందించారు. యువత నడక మరిచి ప్రతి చిన్నపనికి వాహనాల మీద ఆధారపడుతున్నారని రవికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. చక్కని ఆరోగ్యం కోసం ప్రతిఒక్కరూ వ్యాయమంపై దృష్టిసారించాలని ఆయన సూచించారు.
ఇదీ చదవండి: కబ్జాదారులకు కేసీఆర్ కొమ్ముకాస్తున్నారు : బండి సంజయ్